జూరాల గల గల .. శ్రీశైలం కళ కళ
మహారాష్ట్ర, కర్ణాటకలో భారీగా కురుస్తున్న వర్షాల దెబ్బకు వరద నీరు జూరాల ప్రాజెక్టుకు వచ్చి చేరుతోంది. ఎగువన ఉన్న. నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 2.30 లక్షల క్యూసెక్కుల నీరు రాగా.. అధికారులు 25 గేట్లు ఎత్తి.. దిగువకు నీటిని వదిలారు. మరో వైపు తుంగభద్ర లోనూ వరద ప్రవాహం కొనసాగుతోంది. భారీ వర్షాలతో కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టుకు ఎగువ నుంచి 1,45,424 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, దిగువ నదిలోకి 1,56,407 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.
కృష్ణానదికి ఉప నది అయిన కర్ణాటక లోని బళ్లారి జిల్లాలో ఉన్న తుంగభద్ర ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 100.86 టీఎంసీలు కాగా ఎగువ నుంచి 1,44,757 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 33 క్రస్టు గేట్లను ఎత్తి దిగువ నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. తుంగభద్ర నదిపై సుంకేసుల బ్యారేజీ వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు జలాశయం నుంచి ఎత్తిపోతల పథకాలకు పంపింగ్‌ను కొనసాగిస్తున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 1,500 క్యూసెక్కులు, భీమా స్టేజీ–1కు 650, కోయిల్‌సాగర్‌కు 315, జూరాల కుడి ప్రధాన కాల్వకు 822, ఎడమ ప్రధాన కాల్వకు వెయ్యి, సమాంతర కాల్వకు 340 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.
జూరాల జల విద్యుత్ కేంద్రంలోని ఆరు యూనిట్లలో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. జూరాల నుండి వరద నీరు పెరగడంతో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండి పోయింది. అది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. మరో వైపు బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడడంతో ఏపీలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. మత్యకారులను అధికారులు అప్రమత్తం చేశారు. మరో రెదను రోజుల పాటు వానలు వస్తాయని వాతావరణ శాఖా అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. వరద నీరు చేరుకోవడంతో శ్రీశైలం గేట్లు ఎత్తివేసి..నాగార్జున సాగర్ కు నీటిని వదులుతున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి