ఇన్ఫోసిస్ మరో సత్యం కానున్నదా..?

నిన్నటి దాకా ఐటీ సెక్టార్ లో టాప్ పొజిషన్ లో ఉన్న బెంగళూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఇన్ఫోసిస్ ఐటీ కంపెనీ మరో సత్యం కంపెనీ కానున్నదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఐటీ రంగ నిపుణులు. గత ఆరేళ్లలో మొదటిసారిగా ఇన్ఫోసిస్ కంపెనీ షేర్స్ పడిపోయాయి. సీఈవో, సీఎఫ్‌వోలపై సిబ్బంది తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆదాయాలు, లాభాలను పెంచి చూపించేందుకు అనైతిక విధానాలకు పాల్పడుతున్నారంటూ స్వయంగా సీఈవో సలిల్‌ పరేఖ్‌పై వచ్చిన ఆరోపణలతో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ షేరు కుదేలైంది. ఏకంగా 16 శాతం పతనమైంది. మరోవైపు స్వల్ప కాలికంగా ఆదాయాలు, లాభాలు పెంచి చూపించేందుకు ఖాతాలు గోల్‌మాల్‌ చేయిస్తున్నారని, సలిల్‌ పరేఖ్, సీఎఫ్‌వో నీలాంజన్‌ రాయ్‌లపై వచ్చిన ఆరోపణల మీద పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామంటూ ఇన్ఫీ చైర్మన్, సహ వ్యవస్థాపకుడు నందన్‌ నీలేకని స్పష్టం చేశారు.

అంతర్గత ఆడిటర్లు ఈవైతో ఆడిట్‌ కమిటీ సంప్రతింపులు జరుపుతోందని, స్వతంత్ర విచారణ కోసం న్యాయ సేవల సంస్థ శార్దూల్‌ అమర్‌చంద్‌ మంగళ్‌దాస్‌ అండ్‌ కోని నియమించు కున్నామని నీలేకని తెలిపారు. సంస్థలో అనైతిక విధానాల పేరిట ఈ ఏడాది సెప్టెంబర్‌ 30న ఒక బోర్డు సభ్యుడికి గుర్తు తెలియని వారి నుంచి రెండు ఫిర్యాదులు వచ్చినట్లు నీలేకని తెలిపారు. వీటిలో ఒక దానిపై సెప్టెంబర్‌ 20వ తేదీ ఉండగా, రెండో దానిపై తేదీ లేకుండా ప్రజా వేగు ఫిర్యాదు అని ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ రెండింటినీ అక్టోబర్‌ 10న ఆడిట్‌ కమిటీ ముందు, మరుసటి రోజున బోర్డులో నాన్‌–ఎగ్జిక్యూటివ్‌ సభ్యుల ముందు ఉంచినట్లు నీలేకని వెల్లడించారు. తేదీ లేని రెండో లేఖలో ప్రజావేగు ప్రధానంగా సీఈవో అమెరికా, ముంబైల పర్యటనల మీద ఆరోపణలు ఉన్నట్లు వివరించారు.

ఈమెయిల్స్‌ లేదా వాయిస్‌ రికార్డింగ్స్‌ లాంటి వేవీ మాకు అందలేదు. అయినప్పటికీ ఆరోపణలపై పూర్తి స్థాయి విచారణ జరిగేలా చర్యలు తీసుకుంటాం. ఇది నిష్పాక్షికంగా జరిగేలా చూసేందుకు సీఈవో, సీఎఫ్‌వో దీనికి దూరంగా ఉంటారని వెల్లడించారు. విచారణలో వెల్లడయ్యే వివరాలను బట్టి బోర్డు తగు చర్యలు తీసుకుంటుందని నీలేకని చెప్పారు. సీఈవో, సీఎఫ్‌వోలపై అనైతిక విధానాల ఆరోపణలు ఇన్ఫీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అమెరికాలో ఇన్ఫీని ఇరకాటంలో పెట్టేందుకు అక్కడి ఇన్వెస్టర్లు దావాకు సిద్ధమవుతున్నారు. మొత్తం మీద ఇన్ఫోసిస్ పై వచ్చిన ఆరోపణలతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!