ట్రబుల్ షూటర్ కు సోనియా పరామర్శ

దేశంలో వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దిక్కు తోచని స్థితిలో పడిపోయింది. ఒకప్పుడు అధికారాన్ని చెలాయించిన ఈ పార్టీకి చెందిన అతిరథ మహారథులు, దిగ్గజ నాయకులు ఒక్కరొక్కరు పార్టీని వీడడమో లేదా అరెస్టులు కావడమో జరుగుతోంది. పార్టీని ఒకే తాటిపైకి తీసుకు రాగలిగే నాయకత్వ లేమి కొరవడింది. దేశ మంతటా కాషాయ జెండాలు రెపరెప లాడుతున్నాయి. మోడీ చరిష్మా ముందు సోనియా, ప్రియాంక, రాహుల్ గాంధీల ఇమేజ్ ఏ మాత్రం పని చేయడం లేదు. ఇప్పటికే రెండు మూడు చోట్ల తప్పా ఎక్కడా కాంగ్రెస్ పవర్ లో ఉన్న దాఖలాలు లేవు. రాహుల్ గాంధీ తోనైనా కాంగ్రెస్ గట్టెక్కుతుందనుకుంటే ఏకంగా ఎన్నడూ లేని విధంగా ఈసారి జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

చివరకు ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేక చతికిల పడింది. ఇక కర్ణాటకలో జేడీఎస్ తో కలిసి ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని కాపాడుకోలేక పోయింది ఆ పార్టీ. ఊహించని ఓటమితో రాహుల్ గాంధీ అస్త్ర సన్యాసం చేసే పనిలో పడ్డారు. పార్టీ పరంగా వత్తిళ్లు రావడంతో తన మనసు మార్చుకున్నారు. ప్రస్తుతం పార్టీకి పూర్వ వైభవం తీసుకు రావాలని తల్లి సోనియా గాంధీ కృషి చేస్తున్నారు. ఇదే సమయంలో అదును చూసి దెబ్బ కొడుతున్నారు ప్రధాని మోడీ, హోమ్ శాఖా మంత్రి అమిత్ చంద్ర షా. కాంగ్రెస్ పార్టీని నామ రూపాలు లేకుండా చేయాలన్నదే వీరి టార్గెట్. అంతే కాకుండా బలమైన కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేసి తీహార్ జైలుకు పంపిస్తున్నారు. ఇందులో మొదటగా చెప్పు కోవాల్సింది చిదంబరం, డీకే శివకుమార్. వీరిద్దరూ ట్రబుల్ షూటర్లు గా ఉన్నారు. వీరు చిప్ప కూడు తింటున్నారు.

తాజాగా తీహార్ జైల్లో ఉన్న డీకే శివకుమార్ ను కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ నాయకురాలు అంబికా సోనీతో కలిసి పరామర్శించారు. డీకే సోదరుడు సురేష్‌ కూడా కాంగ్రెస్‌ వీరి వెంట ఉన్నారు. కష్ట కాలంలో పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా డీకేకు సోనియా భరోసా ఇచ్చినట్టు సమాచారం. మరోవైపు డీకే బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. మనీ ల్యాండరింగ్‌ కేసులో డీకే శివకుమార్‌ను ఈడీ సెప్టెంబర్‌లో అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. కోట్లాది రూపాయల లావాదేవీలు జరిపిన డీకే, పన్నుల ఎగవేతకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. డీకే అరెస్ట్‌ అనంతరం ఆయన 23 ఏళ్ల కుమార్తె ఐశ్వర్యను సైతం ఈడీ అధికారులు ప్రశ్నించారు. మొత్తం మీద కాంగ్రెస్ కు గడ్డు కాలం నడుస్తోంది. 

కామెంట్‌లు