ఏపీ సీఎస్ పై బదిలీ వేటు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి. సుబ్రమణ్యంపై బదిలీ వేటు పడింది. భూ పరిపాలన శాఖాధికారి నీరబ్ కుమార్ ను ఇంచార్జ్ సీఎస్ గా నియమించింది. గుంటూరు జిల్లా బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డీజీగా బదిలీ చేస్తూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఎస్ బదిలీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉన్నపళంగా ఇలా బదిలీ వేటు వేయడంపై ఉన్నతాధికారులు షాక్ కు గురయ్యారు. సీనియర్ ఐఏఎస్ ల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరులో ఈ బదిలీ జరిగిందనే వార్తలు గుప్పుమన్నాయి.
కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలో ఎల్.వి.సుబ్రహ్మణ్యం అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. పరిపాలనను గాడిలో పెట్టే పని చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఏపీ సీఎం కు తలలో నాలుకలా ఉన్నారు. అన్నింటిని చక్క బెట్టారు. మరో ఐదు నెలలు సర్వీస్ ఉండగానే బదిలీ చేయడాన్ని, అధికార యంత్రాంగంలో కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండే ప్రిన్స్‌పల్ సెక్రటరీ, జీఏడీ పొలిటికల్ సెక్రటరీగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్‌కు ఎల్వీ సుబ్రహ్మణ్యం షోకాజ్ నోటీస్ జారీ చేశారు. దీనికి 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు.
కేబినెట్ అజెండాలో పెట్టే అంశాలను సీఎస్ ఆమోదం లేకుండా నేరుగా ఎజెండాలో చేర్చడం ఏపీ బిజినెస్ రూల్స్‌కు వ్యతిరేకమని, విధి విధానాలు పాటించ లేదని, పైగా సీఎస్ ఆమోదం లేకుండా ఎలా చేస్తారని ఎల్వీ ప్రశ్నిస్తూ షోకాజ్ నోటీస్ జారీ చేశారు. ఈ విషయం సీఎం జగన్‌కు తెలియ కుండానే షోకాజ్ నోటీస్ జారీ చేయడంపై ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఎల్వీ సుబ్రహ్మణ్యంపై బదిలీ వేటు పడింది. అలాగే ఇన్‌చార్జ్ సీఎస్‌గా నీరబ్ కుమార్ ప్రసాద్ కొనసాగేలా ఆదేశాలు జారీ చేశారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి