జోరు మీదున్న మార్కెట్..ఖుషీ మీదున్న ఇన్వెస్టర్స్
స్టాక్ మార్కెట్లో రికార్డుల మోత మోగుతోంది. బీఎస్‌ఈ సెన్సెక్స్ ఇంట్రాడే లోనూ, ముగింపు లోనూ కొత్త రికార్డ్‌లను నెలకొల్పింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కీలకమైన స్థాయి,11,900 పాయింట్ల ఎగువకు ఎగబాకింది. కంపెనీల క్యూ2 ఆర్థిక ఫలితాలు అంచనాలను మించి పోతుండటం, సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరు..ఏడో ట్రేడింగ్ సెషన్‌లోనూ లాభాల్లోనే ముగిశాయి. మార్చి తర్వాత సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా ఇన్ని రోజులు లాభపడటం ఇదే మొదటిసారి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 4 పైసలు పుంజుకొని 70.77 కు చేరడం సానుకూల ప్రభావం చూపించింది.
మెటల్, టెలికం, ఐటీ షేర్లు లాభపడగా, వాహన షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 137 పాయింట్ల లాభంతో 40,302 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ ఏడాది జూన్ 3 నాటి ఆల్‌టైమ్ క్లోజింగ్ రికార్డ్, 40,268 పాయింట్ల రికార్డ్ బద్దలైంది. ఇక ఇంట్రాడేలో కూడా సెన్సెక్స్ జీవిత కాల గరిష్ట స్థాయి, 40,483 పాయింట్లను తాకింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 51 పాయింట్లు పెరిగి 11,941 పాయింట్ల వద్ద ముగిసింది. లాభాల్లో ఆరంభమైన సెన్సెక్స్ అదే జోరు చూపించింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 318 పాయింట్లు, నిఫ్టీ 98 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.
విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతుండటం, అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ రిస్క్‌లు తగ్గుముఖం పట్టటం, వృద్ధి జోరు పెంచడం లక్ష్యంగా మరిన్ని సంస్కరణలకు కేంద్రం తెర తీయనున్నదన్న వార్తలు, ఇవన్నీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్ నిస్తున్నాయి. ఈ నెలలో విదేశీ ఇన్వెస్టర్లు ఇప్పటి దాకా మన క్యాపిటల్ మార్కెట్లో 16,464 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. చైనా, అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం ముగింపు దశకు చేరు కోవడంతో ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. యూరప్ మార్కెట్లు కూడా లాభాల బాట పట్టాయి. మొత్తం మీద ఇన్వెస్టర్స్ కు ఇది మంచి కాలం కదూ.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి