భయం..ప్రభుత్వంపై ఆగ్రహం
తెలంగాణాలో పట్టపగలే ఓ మహిళాధికారి దారుణ హత్యకు గురి కావడం రాష్ట్ర ప్రజలను ఉలికి పాటుకు గురి చేసింది. తహసీల్దార్ విజయారెడ్డిని ఆమె పని చేస్తున్న చోటే సజీవ దహనం చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు కారణం ఏదైనా రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగం మాత్రం తీవ్ర ఆందోళనకు గురైంది. భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం రెవెన్యూ వ్యవస్థపై వస్తున్న ఆరోపణలు, నిందలతో సతమతమవుతున్న రెవెన్యూ యంత్రాంగం తాజా ఘటనతో మరింత టెన్షన్ కు లోనవుతోంది.
విషయం తెలుసుకున్న వెంటనే రెవెన్యూ సంఘాల నేతలు ఘటనను తీవ్రంగా ఖండించడంతో పాటు విధులను కూడా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయం రెవెన్యూ ఉద్యోగులను వెంటా డుతోంది. రెవెన్యూ వ్యవస్థలో ఉన్న తీవ్ర ఒత్తిడితో పాటు బదిలీపై వెళ్లి కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తోందన్న మనస్తాపంతో నెల కిందట నిజామాబాద్ తహసీల్దార్ జ్వాలా గిరి రావు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన ఉద్యోగ వర్గాలను కలవర పరిచింది. ఈ ఘటన మరువక ముందే తాజగా మహిళా తహసీల్దార్‌ను ఏకంగా సజీవ దహనం చేయడం రెవెన్యూ వర్గాలను ఉలికి పడేలా చేసింది.
మండలాల పునర్విభజనలో భాగంగా అబ్దుల్లాపూర్‌మెట్ కొత్తగా రెవెన్యూ మండలమైంది. ప్రస్తుతం తహసీల్దార్ ఆఫీసు అద్దె భవనంలో కొనసాగుతోంది. విధి నిర్వహణలో అధికారిపై సులువుగా దాడి జరగడానికి భద్రతా లోపాలే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. తహసీల్దార్ గదికి రాను పోను ఒకే ద్వారం ఉండడం, మిగతా సిబ్బంది గదులకు దూరంగా, వేరుగా ఉండటంతో తహసీల్దార్ రూమ్‌లో ఎవరున్నారనేది కూడా గమనించలేని పరిస్థితి నెలకొంది. భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు రెవెన్యూ వర్గాలను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. దీంతో ఒత్తిడి పెరిగింది. చాలా చోట్ల క్షేత్ర స్థాయి పరిస్థితులకు, రికార్డులకు పొంతన కుదరక పోవడంతో వివాదాలు పెరిగి పోయాయి.
సాంకేతిక సమస్యలు, కౌలుదారులు, పట్టాదారులు, సోదరులు, కుటుంబ తగాదాలు, కోర్టు కేసులు, ప్రభుత్వ భూములుగా తేలిన వంటి వాటికి పాస్ పుస్తకాలు ఇవ్వ కుండా పక్కన పెట్టడం ఉద్యోగులపై దాడులకు కారణమవుతోంది. సంఘటన స్థలాన్ని సందర్శించిన మంత్రి గంగులకు నిరసన సెగ తగిలింది. ఈ సందర్బంగా రెవెన్యూ ఉద్యోగులు సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన చేసిన కామెంట్స్ వల్లనే తమపై దాడులు జరుగుతున్నాయంటూ ఆరోపిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ సంఘటనపై మిశ్రమ స్పందన రావడం గమనార్హం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి