ఏపీలో రహదారులకు మహర్దశ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టేందుకు కృషి చేస్తోంది. ప్రజా రవాణా వ్యవస్థను మెరుగు పరిచేందుకు చర్యలు చేపట్టారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సందింటి జగన్ మోహన్ రెడ్డి. పనితీరు బాగా లేని అధికారులకు అప్రాధాన్య పోస్టుల్లోకి మార్చేస్తూ, సమర్ధవంతమైన అధికారులకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు. నిన్నటి దాకా సీఎస్ గా ఉన్న ఎల్.వి.సుబ్రహ్మణ్యం ను బదిలీ చేశారు. భూ పరిపాలన శాఖా కమిషనర్ కు అప్పగించారు. మరో వైపు రహదారుల నిర్మాణం కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు అందించే రుణ సాయంతో రాష్ట్రంలో రహదారుల రూపు రేఖలు మార్చాలని జగన్‌ మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

ప్రస్తుతం అందిస్తున్న రుణ సాయం 6,400 కోట్ల నుంచి 8,800 కోట్లకు పెంచేలా కోరాలని నిర్ణయించామన్నారు. రహదారులు, భవనాల శాఖపై సమీక్ష నిర్వహించారు. 3,100 కిలోమీటర్లకు పైగా ఉన్న రోడ్లను అభివృద్ధి చేయడంతో పాటు, అవసరమైన చోట కొత్త వంతెనల నిర్మాణం చేపట్టాలని సూచించారు. జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలకున్న రోడ్లకు ప్రధాన ప్రాధాన్యత ఇవ్వాలని, ఒకవేళ ఇప్పుడున్న రోడ్లు బాగుంటే, మండల కేంద్రం నుంచి మరో మండల కేంద్రానికి వెళ్లే రోడ్లపై దృష్టి పెట్టాలన్నారు. అవసాన దశలో ఉన్న 676 బ్రిడ్జిలను ఎన్‌డీబీ ప్రాజెక్టులో పెట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లను వెంటనే గుర్తించి, 625 కోట్లతో సత్వర మరమ్మతులు చేపట్టాలన్నారు.

అనంతపురం, అమరావతి ఎక్స్‌ప్రెస్‌ దారిని చిలకలూరిపేట బైపాస్‌కు అనుసంధానం చేసే ప్రతిపాదనకు సీఎం జగన్‌ అంగీకారం తెలిపారు. భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా ఆరు లేన్లకు సరిపడా టన్నెల్స్‌ ఉండాలని సీఎం సూచించారు. ఏపీఆర్‌డీసీ బలోపేతానికి అధికారులు చేసిన ప్రతిపాదనలకు సీఎం సానుకూలంగా స్పందించి చట్టంలో సపరణలకు అంగీకరించారు. ఆర్టీసీకి సంబంధించిన 12 లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగిన 3,600కు పైగా బస్సులను వెంటనే రీప్లేస్‌ చేయాలని సూచించారు. అప్పుడే ప్రయాణికుల భద్రతకు సరైన ప్రమాణాలు పాటించినట్ల వుతుందన్నారు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు ప్రణాళికలు వేసుకుని వాటిని అమలు చేయడానికి కార్పొరేషన్‌ దృష్టి పెట్టాలన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!