పేదల కోసం ఆరోగ్య పథకం


ఆయుష్మాన్‌‌ భారత్‌‌, నేషనల్‌‌ హెల్త్‌‌ మిషన్‌‌ వంటి ఎన్ని పథకాలు ఉన్నా, మధ్య తరగతి కుటుంబాలకు ఆరోగ్య బీమా అందని ద్రాక్ష గానే మారిందని నీతి ఆయోగ్‌‌ పేర్కొంది. వీరి కోసం ప్రత్యేక ఆరోగ్య బీమా పథకం తీసుకు రావాల్సిన అవసరం ఉందని సూచించింది. ఇప్పుడున్న వైద్య సంరక్షణ పథకాలను కలిపి, హెల్త్‌‌ కేర్‌‌ సిస్టమ్‌‌ను తయారు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని అభిప్రాయ పడింది. ఇప్పటికీ 50 శాతం మందికి బీమా సదుపాయం లేదని వెల్లడించింది. పేద, ధనిక తేడాలు లేకుండా, అందరికీ ఆరోగ్య సంరక్షణ పథకాన్ని వర్తింప జేయాలని, ఇందు కోసం ప్రతి ఒక్కరినీ తప్పని సరిగా హెల్త్‌‌ ఇన్సూరెన్స్‌‌ స్కీమ్‌‌లోకి తీసుకు రావాలని నీతి ఆయోగ్‌‌ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు  చేసింది.

మధ్య తరగతి వారి కోసం ఒక బీమా పథకం తప్పక తీసుకు రావాలని స్పష్టం చేసింది. ఇప్పుడున్న అన్ని ఆరోగ్య సంరక్షణ, బీమా పథకాలను కలిపేయాలని సూచించింది. దీనివల్ల ఆరోగ్య రంగంపై పెట్టే ఖర్చు తగ్గుతుందని, మారుమూల ప్రాంతాలకూ వైద్య సేవలు అందుతాయని అభిప్రాయ పడింది. హెల్త్‌‌ సిస్టమ్‌‌ ఫర్‌‌ న్యూ ఇండియా పేరుతో నీతి ఆయోగ్‌‌ పూర్తి నివేదికను వెల్లడించింది. అన్ని ఇన్సూరెన్స్‌‌ స్కీములకు వర్తించేలా ఒక స్టాండర్డ్‌‌ బెనిఫిట్‌‌ ప్యాకేజీ ఉండాలి. ఇప్పుడున్న ఆయుష్మాన్‌‌ భారత్‌‌, నేషనల్‌‌ హెల్త్‌‌ మిషన్‌‌ వంటి స్కీములు పేదలకు మాత్రమే వర్తిస్తున్నాయి. వీటి పరిధిలోకి రానివాళ్లు వైద్య చికిత్సల కోసం విపరీతంగా ఖర్చు చేయాల్సి వస్తోంది.

జీడీపీలో 1.4 శాతాన్ని ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ప్రజలు దేశంలో ఎక్కడికి వెళ్లినా తమ జేబు నుంచి ఖర్చు పెట్టకుండా, బీమా పథకం ద్వారా వైద్య సేవలు అందేలా చూడాలని సూచించింది. ఈ విషయంలో కర్ణాటక, మేఘాలయ రాష్ట్రాలు అమలు చేస్తున్న ఆరోగ్య పథకాలు బాగున్నాయని ప్రశంసించింది. సువర్ణ ఆరోగ్య సురక్ష ట్రస్ట్‌‌ పేరుతో కర్ణాటక నిర్వహిస్తున్న పథకం ద్వారా లబ్ధిదారులు స్వరాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ చికిత్సలు చేయించు కోవచ్చు. 

దేశంలో అత్యధికులు వైద్య సేవల కోసం ప్రైవేటు ఆస్పత్రులకే వెళ్తున్నారని, అవి తమకు నచ్చిన రీతిలో ఫీజులు, చార్జీలు వసూలు చేస్తున్నాయని పేర్కొంది. ప్రభుత్వ రంగంలోనూ ఆరోగ్య సంరక్షణ కోసం చాలా పథకాలు ఉన్నాయి. దీనివల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదు. ప్రభుత్వాలు పెట్టే ఖర్చూ ఎక్కువ అవుతోంది. మధ్య తరగతి ప్రజలు ఏ పథకంలోకి రావడం లేదు. వీరి కోసం త్వరలోనే ఒక పథకాన్ని ప్రతిపాదిస్తాం. ఇండియాలో అతి తక్కువ మందికి మాత్రమే హెల్త్‌‌ ఇన్సూరెన్స్‌‌ సదుపాయం ఉంది. దేశమంతటికీ ఒకే స్కీమ్​ ఉండాలి అని నీతి ఆయోగ్ అభిప్రాయం పడింది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!