అందరి చూపు ఈడెన్ వైపు


ప్రపంచంలోనే అత్యున్నతమైన క్రికెట్ ఆటకు వేదికైన ఈడెన్ గార్డెన్స్ మరో చరిత్రకు నాంది పలకబోతోంది. గులాబీ గుబాళింపులన్నీ సిటీ ఆఫ్‌ జాయ్‌ లోనే కనిపిస్తున్నాయి. కోల్‌కతాలో ఎక్కడ చూసినా ఇప్పుడు పింక్‌ టెస్టు పలుకులే. క్రికెట్‌ను ప్రేమించే చారిత్రక నగరానికి ఇప్పుడు కొత్త శోభ చేకూరింది. తొలిసారి జరుగుతున్న డే అండ్‌ నైట్‌ టెస్టును విజయవంతం చేసేందుకు కోల్‌కతా వాసులంతా ప్రయత్నం చేస్తున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ పింక్‌ టెస్టును సూపర్‌ సక్సెస్‌ చేసేందుకు, చిరస్మరణీయంగా మార్చేందుకు అన్ని రకాల ఏర్పాట్లూ చేశాడు. భారత్, బంగ్లాదేశ్‌ మధ్య జరిగే డే అండ్‌ నైట్‌ టెస్టు మ్యాచ్‌కు పలు ఆకర్షణలు తోడవుతున్నాయి.

గతంలో భారీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన బెంగాల్‌ క్రికెట్‌ సంఘం ఈ సారి కూడా ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు. సౌరవ్‌ గంగూలీ బీసీసీఐ అధ్యక్ష హోదాలో ఉండటం కూడా వారికి అదనపు బలాన్ని ఇచ్చింది. ఆతిథ్యం అద్భుతంగా ఉండేందుకు ‘క్యాబ్‌’ అన్ని ఏర్పాట్లు చేసింది. స్వయంగా గంగూలీనే అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించారు. టెస్టు మ్యాచ్‌ సందర్భంగా చేయబోయే ప్రత్యేక కార్యక్రమాల గురించి వెల్లడించారు. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా ఈ టెస్టు మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు గంటను ఆమె మోగిస్తారు. హసీనాతో పాటు బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

భారత క్రికెట్‌ దిగ్గజాలు సునీల్‌ గవాస్కర్, కపిల్‌దేవ్, సచిన్‌ టెండూల్కర్, రాహుల్‌ ద్రవిడ్, అనిల్‌ కుంబ్లే, తదితరులు తొలి రోజు ఆటను ప్రత్యక్షంగా తిలకిస్తారు. టీ విరామ సమయంలో ప్రత్యేకంగా సిద్ధం చేసిన వాహనాల్లో భారత మాజీ కెప్టెన్లు స్టేడియంలో కలియ తిరగనున్నారు. ప్రముఖ బాలీవుడ్‌ సంగీత దర్శకుడు జీత్‌ గంగూలీ, బెంగాలీ గాయని రూనా లైలా తదితరులతో సంగీత కార్యక్రమం ఉంటుంది. సచిన్, ద్రవిడ్, గంగూలీ, కుంబ్లేలతో వీవీఎస్‌ లక్ష్మణ్‌ పాల్గొనే ప్రత్యేక చర్చా కార్యక్రమం ఉంటుంది.

ఇందులో చారిత్రాత్మక 2001 టెస్టు విశేషాల గురించి మాట్లాడతారు. మొదటి రోజు ఆట ముగిసిన తర్వాత దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన పలువురు క్రికెటేతర ఆటగాళ్లకు సన్మానం ఉంటుంది. షూటర్‌ అభినవ్‌ బింద్రా, షట్లర్‌ పీవీ సింధు, చెస్ స్టార్ విశ్వనాథన్‌ ఆనంద్, టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా, మేటి బాక్సర్‌ మేరీ కోమ్, కోచ్ గోపీచంద్‌ తదితరులు ఉన్నారు. మ్యాచ్‌ తొలి నాలుగు రోజుల టికెట్లన్నీ అమ్ముడు పోవడం విశేషం. మొత్తం మీద దాదా తానేమిటో, తన సత్తా ఏపాటిదో ఇప్పటికే రుచి చూపించాడు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!