సర్కారుదే ఆలశ్యం..సమ్మె విరమణకు సిద్ధం

అలుపెరుగకుండా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ముగింపు దశకు చేరుకుంది. ఎలాంటి షరతులు విధించ కుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమించేందుకు సిద్ధమని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. సమ్మె వ్యవహారాన్ని కార్మిక న్యాయ స్థానమే తేల్చాలని, దీనికి రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని పేర్కొంటూ హైకోర్టు కార్మిక శాఖ కమిషనర్‌కు సూచించింది. ఈ వ్యవహారం ఇప్పుడు కార్మిక శాఖకు చేరింది. దీంతో కార్మిక న్యాయస్థానంలో తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని జేఏసీ వెల్లడించింది.

ప్రజలు, కార్మికుల ప్రయోజనాల దృష్ట్యా సమ్మె విరమించేందుకు సిద్ధమని ప్రకటించింది. సమ్మెలో ఉన్న కార్మికుల ఆత్మ గౌరవం కాపాడాలని, సమ్మెకు పూర్వం ఉన్న పరిస్థితి కల్పించి వారిని విధుల్లోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. దీనికి ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం నుంచి సానుకూలత వ్యక్తమైతేనే సమ్మె విరమిస్తామని పేర్కొంది. లేని పక్షంలో యథాతథంగా సమ్మెను కొనసాగిస్తామని తేల్చి చెప్పింది. సమ్మె విషయంలో హైకోర్టులో ఊరట లభిస్తుందని ముందు నుంచి ఊహించిన కార్మికులకు షాక్ ఇచ్చింది. అనుకూల నిర్ణయం తీసుకునేలా ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వక పోవటంతో సమ్మె కొనసాగించే విషయంలో పునరాలోచనలో పడ్డారు జేఏసీ నాయకులు.

తీర్పు రావటానికి మరికొంత సమయం పడుతుండటంతో సమ్మె విరమించాలంటూ జేఏసీపై ఒత్తిడి వచ్చింది. అదే సమయంలో సమ్మెను మరింత ఉధృతం చేయాలన్న ఒత్తిడి కూడా ప్రారంభమైంది. దీంతో మెజార్టీ కార్మికుల అభిప్రాయానికి తగ్గట్టుగా నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంతో, డిపోల స్థాయి నేతలతో జేఏసీలోని నాలుగు సంఘాలు విడివిడిగా సమావేశమై చర్చించిన సంగతి తెలిసిందే. ఇందులో సమ్మె విరమించాలనే అభిప్రాయం ఎక్కువగా వ్యక్తమైనా, దానికి భిన్నమైన వాదన కూడా వచ్చింది. ఆ తర్వాత జేఏసీ భేటీ అయినా ఓ నిర్ణయానికి రాలేక పోయింది. కార్మిక శాఖ ఎలా వ్యవహరించే అవకాశం ఉంది.. కార్మిక న్యాయ స్థానానికి కేసు బదిలీ అయితే ఏం జరిగే అవకాశం ఉంది, తదితరాలపై న్యాయవాదుల సలహా తీసుకున్నాక తుది నిర్ణయం వెల్లడించాలని నిర్ణయించింది.

హైకోర్టు పేర్కొన్న అంశాలకు సంబంధించిన పూర్తి ప్రతి ఆధారంగా న్యాయవాదులతో సుదీర్ఘంగా చర్చించి చివరకు సమ్మె విరమణకే మొగ్గు చూపింది. ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యాలయంలో వివరాలను జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి వెల్లడించారు. సమ్మె విరమించాక కార్మికులను విధుల్లోకి తీసుకోకుంటే పరిస్థితి గందరగోళంగా మారే ప్రమాదం ఉన్నందున  కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలన్న ప్రతిపాదనను జేఏసీ ప్రభుత్వం ముందుంచింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే తమ ప్రధాన డిమాండ్‌ అంటూ పేర్కొన్నా, దాన్ని తాత్కాలికంగా విరమించు కుంటున్నట్లు 10 రోజుల క్రితమే ప్రకటించి ఓ మెట్టు దిగింది. ఇప్పుడు 47 రోజుల పాటు ఉధృతంగా నిర్వహించిన సమ్మెనే విరమించు కునేందుకు సిద్ధమని పేర్కొంది. దీంతో మెట్టు దిగకుండా భీష్మించుకుని కూర్చున్న ప్రభుత్వం నిర్ణయంపై ప్రస్తుతం అందరి దృష్టి నిలిచింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!