శివసేనకు లైన్ క్లియర్

మహా ఉత్కంఠకు తాత్కాలికంగా తెర పడింది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై కొంత స్పష్టత వచ్చింది. ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు మద్దతిచ్చేందుకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ అంగీకరించారు. సైద్ధాంతికంగా తీవ్ర విబేధాలున్న శివసేనకు కాంగ్రెస్‌ మద్దతివ్వడంపై నెలకొన్న అనుమానాలు తొలిగాయి. ఎన్సీపీ, కాంగ్రెస్‌ల మద్దతుతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దాదాపు ఖాయమైంది. కాంగ్రెస్, ఎన్సీపీ సీనియర్‌ నేతలు ఢిల్లీలోని ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ నివాసంలో నాలుగు గంటలకు పైగా చర్చలు జరిపారు.

త్వరలో మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందని మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్‌ నేత పృథ్వీరాజ్‌ చౌహాన్‌  ప్రకటించారు. ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేనలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయని ఎన్సీపీ నేత నవాబ్‌ మాలిక్‌ చెప్పారు. బీజేపీతో సేన తెగ తెంపులయ్యాక ఎన్సీపీ, కాంగ్రెస్‌ మద్దతుతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందన్న వార్తలు రావడం మొదలయ్యాక, ఈ విషయమై స్పష్టమైన ప్రకటన రావడం ఇదే ప్రథమం. కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య చర్చలు కొనసాగుతాయని, కూటమికి సంబంధించి మరి కొన్ని అంశాల్లో స్పష్టత రావాల్సి ఉందని పృథ్వీరాజ్‌ చౌహాన్‌ చెప్పారు. 

ముఖ్యమంత్రి పీఠాన్ని మొదట శివసేన, ఆ తరువాత ఎన్సీపీ చెరో రెండున్న రేళ్లు పంచు కునేందుకు, కాంగ్రెస్‌కు ఐదేళ్ల పాటు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు సూత్ర ప్రాయంగా ఒప్పందం కుదిరిందని ఎన్సీపీ వర్గాలు వెల్లడించాయి. పూర్తిగా ఐదేళ్లు శివసేనకే ముఖ్యమంత్రి పీఠం అప్పగించలేం. చివరి రెండున్న రేళ్లు ఎన్సీపీ నేత సీఎంగా ఉంటారు అని తెలిపాయి. శివసేన, ఎన్సీపీల మధ్య సీట్ల తేడా కూడా రెండు మాత్రమేనని ఎన్సీపీ నేత ఒకరు గుర్తు చేశారు. అయితే కాంగ్రెస్, ఎన్సీపీ చర్చల్లో సీఎం పదవిపై చర్చ జరగలేదని కాంగ్రెస్‌ నేతలు చెప్పారు.

ప్రభుత్వ ఏర్పాటుపై అడ్డంకులు దాదాపు తొలగినట్లేనని, అతి త్వరలోనే శివసేన నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్ర రైతాంగ సంక్షోభాన్ని ప్రధానికి వివరించేందుకు సీనియర్‌ నేత, మాజీ వ్యవసాయ మంత్రి అయిన శరద్‌ పవారే సరైన వ్యక్తి అని భావించి, తామే ఆయనను ప్రధానిని కలిపే ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించమని కోరామన్నారు. తాను కూడా పవార్‌తో భేటీ అయిన విషయాన్ని గుర్తు చేశారు. ఢిల్లీ పరిణామాలపై ఎప్పటికప్పుడు శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రేకు, యువనేత ఆదిత్య ఠాక్రేకు సమాచారం ఇస్తున్నామని సంజయ్ రౌత్ చెప్పారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!