ప్రపంచం మెచ్చిన మనోడు
మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈఓ గా ఉన్న తెలుగు వాడైన సత్య నాదెళ్ల అరుదైన రికార్డును స్వంతం చేసుకున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఫార్చూన్ బిజినెస్ పర్సన్ గా ఎంపికయ్యారు. సత్య నాదెళ్లతో పాటు మరికొందరు భారతీయులకు ఈ లిస్టులో చోటు సంపాదించారు. కాగా ఈ ఏడాది ‘ఫార్చూన్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్–2019’ జాబితాలో ప్రథమ స్థానాన్ని సొంతం చేసుకున్నారు నాదెళ్ల. ధైర్యంగా లక్ష్యాలను చేరుకోవడం, అసాధ్యాలను సుసాధ్యం చేయడం, సృజనాత్మక పరిష్కార మార్గాలను కనుగొనడం వంటి కీలక అంశాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు.
ఇందులో మొత్తం 20 మంది పేర్లు ఉండగా.. వీరిలో ముగ్గురు భారతీయ సంతతికి చెందిన వారే ఉండడం విశేషం. ఇక తెలుగు వాడైన సత్య నాదెళ్ల తొలి స్థానంలో ఉండడం మరో విశేషం. వ్యూహాత్మక నాయకుడి పాత్రలో ఒదిగి పోయిన ఆయన, కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో విజయవంతంగా దూసుకు పోతూ కస్టమర్లలో నమ్మకాన్ని పెంచడం ద్వారా ఈ స్థానానికి చేరుకోగలిగారని ఫార్చూన్ మ్యాగజైన్ ఈ సందర్భంగా కొనియాడింది. తాజాగా 10 బిలియన్ డాలర్ల పెంటగాన్ క్లౌడ్ కాంట్రాక్టును అందు కోవడంలో నాదెళ్ల చూపిన చొరవ కంపెనీని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చిందని స్వయంగా ఆ సంస్థ స్వతంత్ర డైరెక్టర్లు చెప్పినట్లు వివరించింది.
బిల్ గేట్స్ వలే వ్యవస్థాపకుడు, స్టీవ్ బాల్‌మెర్ వంటి సేల్స్ లీడర్ కాక పోయినప్పటికీ.. 2014లో ఆశ్చర్యకరంగా ఆయన ఎన్నిక జరిగింది. ఇటీవలే ప్రతిష్టాత్మక హార్వర్డ్ బిజినెస్ రివ్యూ రూపొందించిన 10 అగ్రశేణి కంపెనీల సీఈఓల జాబితాలో నాదెళ్ల కూడా ఉన్నారు. మాస్టర్ కార్డ్ సీఈఓ అజయ్ బంగా 8వ స్థానంలో ఉండగా, కాలిఫోర్నియా కంప్యూటర్ నెట్ వర్కింగ్ సంస్థ అరిస్టా హెడ్ జయశ్రీ ఉల్లాల్ 18వ స్థానంలో నిలిచారు. 2వ స్థానంలో ఫోర్టెస్క్యూ మెటల్స్ గ్రూప్ సీఈఓ ఎలిజబెత్ గెయినెస్, చిపోటిల్ మెక్సికన్ గ్రిల్ సీఈఓ బ్రియాన్ నికోల్ 3వ స్థానంలో ఉన్నారు. సింక్రొనీ ఫైనాన్షియల్ సీఈఓ మార్గరెట్ కీనే 4, ప్యూమా సీఈఓ జోర్న్ గుల్డెన్ 5వ స్థానంలో నిలిచారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి