సాగుతున్న..మహా..సస్పెన్స్


మారాఠాలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ప్రభుత్వ ఏర్పాటుకు డెడ్‌లైన్‌ ముంచు కొస్తోంది. అయినా ఇరు పార్టీలు వెనక్కి తగ్గడం లేదు. చెరో రెండున్నరేళ్లు సీఎం పదవిని పంచు కోవాలని డిమాండ్‌ చేస్తున్న శివసేన పట్టిన పట్టు వీడడం లేదు. రొటేషన్‌ పద్ధతిలో సీఎం పదవిని పంచు కోవడానికి సిద్ధపడితే బీజేపీతో ఎప్పుడైనా చర్చలకు సిద్ధమేనని ఆ పార్టీ ప్రకటించింది. 105 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి 182 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని విస్తృతంగా ప్రచారం జరగడంతో శివసేనలో చీలికలు వస్తాయన్న ఆందోళన మొదలైంది.

అందుకే ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించ కుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశమై గంటకు పైగా చర్చలు జరిపారు. మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకునే సర్వాధికారాలు పార్టీ అధినేతకే కట్ట బెడుతూ ఎమ్మెల్యేలందరూ తీర్మానాన్ని ఆమోదించారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు చేజారి పోకుండా ఫైవ్‌ స్టార్‌ హోటల్‌కి తరలించారు. బీజేపీ సీనియర్‌ నాయకులు గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కొషియారిని కలుసుకున్నారు. 

అసెంబ్లీ గడువు ముగిసేలోగా ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాక పోతే, అతి పెద్ద పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్‌ ఆహ్వానించాల్సి ఉంటుందని సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. కాగా, ముఖ్యమంత్రి రేసులో తాను లేనని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్‌నే ఎమ్మెల్యేలు శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నుకున్నారని తెలిపారు. మొత్తం మీద శివ సేన, బీజేపీల మధ్య పోరులో ఎవరు కుర్చీ పై కూర్చుంటారనే ఉత్కంఠ నెలకొంది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!