తెగే దాకా తీగ లాగొద్దు


ఓ వైపు కార్మికులు ..మరో వైపు ప్రభుత్వం మెట్టు దిగడం లేదు. ఇన్నేళ్ల సర్వీసులో ఇలాంటి అధికారులను చూడలేదు. అన్నీ అబద్దాలే. ఇది చట్ట వ్యతిరేకం. కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది. మీరు సమర్పించిన అఫిడవిట్లు తప్పుల తడకగా వున్నాయి. అసలు మంత్రి, ప్రభుత్వం ఉండీ ఏం ప్రయోజనం. ప్రజలు ఎన్నుకున్నది ఆస్తులు ధారాదత్తం చేసేందుకు కాదు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వం ఇది. రాజ్యాంగానికి లోబడి ఉండాల్సిందే. అందరూ చట్టం ముందు సమానులే అన్న విషయం మరిచి పోయినట్టు ఉంది. చివరి అస్త్రం ప్రయోగించే అధికారం కోర్టుకు అంతిమంగా ఉందన్న సోయి సీఎం గుర్తించాలి. ఇదేదో రాజరిక వ్యవస్థ లాగా అనిపిస్తోంది. శాఖల మధ్య సమన్వయం లేదు. మీ నిర్వాకం వల్ల కోట్లాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. క్షమాపణలు కాదు కావాల్సింది. సమస్యకు పరిష్కారం చేసే దిశగా చూడాలి.

నీళ్ల కోసం కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం కార్మికులకు వేతనాలు చెల్లించ పోవడం దారుణం. ప్రభుత్వం చిత్తశుద్ధితో పథకాలను అమలు చేస్తోందని అంటే అర్థం ఇష్టానుసారం పాలన సాగించడానికి లైసెన్స్ లభించినట్టు కాదు. కార్మికులు కూడా ఓ మెట్టు దిగి రావడం వల్ల వచ్చిన నష్టమేమీ లేదు. శక్తివంతమైన రాజ్యాల ఎదుగుదలను, అవి కుప్ప కూలి పోవడాన్ని తెలంగాణ చూసింది. ప్రజల పట్ల చూపాల్సింది అధికారం కాదు, ఔదార్యం. ఒకే నియోజకవర్గానికి అభివృద్ధి కోసం 100 కోట్లు కేటాయించిన  ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల విషయంలో  చూపడం లేదు. రాజు తండ్రిలాంటి వాడు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రజలను కాపాడాలి. అధికారం ఎంత ఎక్కువగా ఉంటే దాన్ని అంత తక్కువ వాడాలి. మా వద్దా కోర్టు ధిక్కారణ అధికారం ఉంది. మా ముందు అధికారులు దాఖలు చేసిన అఫిడవిట్లన్నీ కోర్టు ధిక్కార పరిధిలోకి వచ్చేవే. మేం ఇప్పుడు ఆలోచిస్తోంది 48 వేల మంది ఉద్యోగుల గురించి కాదు. 3 కోట్ల మంది ప్రజల గురించి.

కార్మికులతో చర్చలు జరపండి, ఓ నిర్ణయానికి రండి అంటూ ధర్మాసనం సూచించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, జస్టిస్‌ అన్నిరెడ్డి అభిషేక్‌ రెడ్డి లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విచారణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌ శర్మలతోపాటు పలువురు అధికారులు హాజరయ్యారు. కేంద్రం తరఫున ఏఎస్‌జీ  రాజేశ్వరరావు వాదనలు వినిపించారు. టీఎస్‌ఆర్టీసీ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం తమ అనుమతి తీసుకోలేదన్నారు. తమ దృష్టిలో టీఎస్‌ఆర్టీసీకి ఎటువంటి గుర్తింపు లేదన్నారు. ఆర్టీసీ విభజనకు కేంద్రం ఆమోదం తప్పనిసరని స్పష్టం చేసింది. వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం 47 కోట్ల విషయంలో ఎందుకు మొండి పట్టుదల ప్రదర్శిస్తోందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించింది. ముఖ్యమంత్రి మాటలన్నీ బెదిరించేలా ఉన్నాయి. ఇది క్షమార్హం కాదని హెచ్చరించింది.

మాది పేద కుటుంబం. మా అమ్మ 13 మందిని పెంచింది. పిల్లలందరికీ అన్నం సరి పోదని తెలిసీ అన్నం వండేటప్పుడు నీళ్లు ఎక్కువ పోసి, అన్నాన్ని పిల్లలకు పెట్టి మా అమ్మ గంజి తాగి బతికింది. అదీ తల్లి మనసు అని సీజే చెప్పారు. ప్రజలకు రాజే తండ్రని, అటువంటి రాజు ప్రజలపట్ల ఔదార్యం చూపాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయ స్థానాలైనా, ప్రభుత్వాలైనా ఉన్నది ప్రజల కోసమేనని ధర్మాసనం స్పష్టం చేసింది.  గజిబిజి లెక్కలతో చాలా తెలివి ప్రదర్శిస్తూ  తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుదోవ పట్టించే అధికారులను ఆ పోస్టుల్లో కొనసాగించడం సబబు కాదని అభిప్రాయ పడింది. మొత్తంగా ప్రభుత్వానికి ధర్మాసనం ఓ రకంగా హెచ్చరిక చేసిందనే చెప్పక తప్పదు. ఇప్పటికైనా సీఎం మొండి పట్టు వీడి పరిష్కరిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!