సమ్మెపై సీజే సీరియస్..సర్కారు తీరుపై ఫైర్
ఆర్టీసీసమ్మెపై హైకోర్టు సీరియస్ అయ్యింది. నా 15 ఏళ్ళ సర్వీసు లో నేను మూడు రాష్ట్రాల్లో పని చేశా..కానీ ఇలాంటి అబద్దాలు చెప్పే ఐఏఎస్ అధికారులను ఎప్పుడూ చూడలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు చీఫ్ జస్టిస్. కార్మికులు చేసున్న ఆందోళనను పరిష్కారించాలన్న ధ్యాస ఆర్టీసీ అధికారులకు, మంత్రికి, సీఎంకు లేనట్లుందని మండి పడింది. సమ్మెపై కేంద్ర ప్రభుత్వం కూడా వాదనలు వినిపించింది. కేంద్రానికి ఏపీఎస్‌ఆర్టీసీలో 33 శాతం వాటా ఉందని తెలిపింది. ఆ వాటా టీఎస్‌ఆర్టీసీకి ఆటోమేటిక్‌గా బదిలీ కాదని వాదించింది. ఈ క్రమంలో టీఎస్‌ఆర్టీసీలో 33 శాతం వాటా అనేది తలెత్తదని వివరణ ఇచ్చింది. ఏపీఎస్‌ఆర్టీసీ విభజన పూర్తి కాలేదని, విభజన చేస్తే కేంద్రం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.
కేంద్రం వాదనపై స్పందించిన ఎస్కే జోషి, ఆర్టీసీ ఏపీ పునర్విభజన చట్టంలోని షెడ్యుల్ 9 కిందకు వస్తుందని కోర్టుకు తెలిపారు. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం టీఎస్‌ఆర్టీసీని ఏర్పాటు చేసినట్టు ఏజీ, ఆర్టీసీ ఎండీ కోర్టుకు వివరించారు. ఆర్టీసీ విభజన అంశం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందని చెప్పారు. అయితే వారి వ్యాఖ్యలపై స్పందించిన హైకోర్టు, ఓ వైపు విభజన పెండింగ్‌లో ఉందని, మరో వైపు కొత్త ఆర్టీసీ ఏర్పాటు చేశామని అంటున్నారని, అది ఎలా సాధ్యమని నిలదీసింది. ఏపీఎస్‌ఆర్టీసీ విభజన కోసం రెండు రాష్ట్రాలు కేంద్రం అనుమతి కోరాలి కదా అని ప్రశ్నించింది. నీటి పారుదల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వానికి, ఆర్టీసీకి 49 కోట్లు చెల్లించడానికి ఇబ్బంది ఎందుకని మండి పడింది. ప్రజల కోసం ప్రభుత్వం తన స్టాండ్ మార్చుకోవాలని ఆదేశించింది.
అంతకు ముందు విచారణ సందర్భంగా కోర్టుకు సమర్పించిన నివేదికలపై సీఎస్‌ను వివరణ ఇవ్వాలని హైకోర్టు కోరింది. ఆర్థిక శాఖ సమర్పించిన రెండు నివేదికలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని తెలిపింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు నివేదికలు ఇస్తే.. కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హెచ్చరించింది. రికార్డులు పరిశీలించాకే నివేదిక ఇస్తున్నట్టు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు కోర్టుకు విన్నవించారు. దీనిపై స్పందించిన న్యాయ స్థానం. మొదటి నివేదిక పరిశీలించ కుండానే ఇచ్చారా సూటిగా ప్రశ్నించింది. సమయాభావం వల్ల రికార్డుల ఆధారగా నివేదిక రూపొందించామని, మన్నించాలని హైకోర్టును కోరారు.క్షమాపణలు కోరడం సమాధానం కాదని, వాస్తవాలు చెప్పాలని పేర్కొంది.
హైకోర్టును తప్పుదోవ పట్టించేందుకు చాలా తెలివిగా గజిబిజి లెక్కలు, పదాలు వాడారని ఆగ్రహం వ్యక్తం చేసింది. రుణ పద్దుల కింద కేటాయించిన నిధులు అప్పులు కాదని గ్రాంట్ అని తెలివిగా చెబుతున్నారన్న హైకోర్టు, ఇప్పటి వరకు ఏ బడ్జెట్‌లో అలా చూడలేదని తెలిపింది. ఆర్టీసీ ఎండీ చెబుతున్న లెక్కలు వేరుగా ఉన్నాయని, వాటిని మేం పరిగణలోకి తీసుకోవాలా అని ప్రశ్నించింది. ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టీసీ ఎండీ నివేదిక మంత్రులని తప్పుదోవ పట్టించేలా ఉందని అభిప్రాయపడింది. మీ బాస్‌ను తప్పు దోవ పట్టించిన మీరు, మాకు నిజాలు చెబుతారని ఎలా నమ్మాలి అని ప్రశ్నించింది. వచ్చే 11 కు తీర్పును ధర్మాసనం వాయిదా వేసింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి