కొత్తగా కొలువు తీరేదెవ్వరో

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం రెండుగా చీలి పోయాక ఉన్న అస్తిత్వాన్ని పూర్తిగా కోల్పోయింది. ఒకానొక దశలో బలమైన కేడర్ కలిగిన పార్టీకి దిశా నిర్దేశం చేసే నాయకత్వం లేక పోవడం పార్టీకి శాపంగా మారింది. కాంగ్రెస్ లో అందరూ లీడర్లే, ప్రజల సమస్యల కంటే పదవుల కోసం కొట్లాడటం తోనే సరిపోయింది. తెలంగాణాలో గత కొన్నేళ్లుగా పార్టీ మరింత దిగజారింది. ఏ కోశానా అధికార టిఆర్ఎస్ పార్టీకి పోటీ ఇవ్వలేక చతికిల పడిపోయింది. ఇదిలా ఉండగా తెలంగాణాలో పార్టీని మరింత బలోపేతం చేసే ఆలోచనలో పార్టీ హైకమాండ్ దృష్టి పెట్టింది. తాజాగా టీపీసీసీ ప్రెసిడెంట్, ఎంపీగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. అదేమిటంటే తాను ఇక పార్టీ ప్రెసిడెంట్ పదవి నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

దీంతో పదవి కోసం ఆశావహుల సంఖ్య పెరిగింది. హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల ప్రజలకు, నల్లగొండ పార్లమెంటు పరిధిలోని ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేందుకు గాను తాను టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి మున్సిపల్‌ ఎన్నికల తర్వాత తప్పుకుంటానని ప్రస్తుత చీఫ్‌ ఉత్తమ్‌ స్వయంగా వెల్లడించారు. ఇక ఆయన వారసుడు ఎవరనే దానిపై కాంగ్రెస్‌ కేడర్‌లో విస్తృత చర్చ జరుగుతోంది. వాస్తవానికి, గత ఏడాది నుంచి టీపీసీసీ అధ్యక్షుని మార్పుపై రాష్ట్రంలో చర్చ జరుగుతున్నా, స్వయంగా ఉత్తమ్‌ వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్‌కు కొత్త బాస్‌ ఎవరనేది ఉత్కంఠ కలిగిస్తోంది. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీధర్‌బాబుల పేర్లు రేసులో ముందు వరుసలో వినిపిస్తుండగా, టీపీసీసీ ముఖ్య నేతలు చాలా మంది తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

ఇదే సమయంలో వీరితో పాటు చాలా మంది నేతలు పోటీ పడుతున్నారు. మాస్‌లో మంచి ఫాలోయింగ్‌ ఉండటంతో పాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మంత్రి పదవిని త్యజించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అవకాశం ఇస్తారనే చర్చ చాలా కాలంగా జరుగుతోంది. ఆయన కూడా బహిరంగంగా తాను పదవి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని పలుమార్లు చెప్పగా, గులాంనబీ ఆజాద్‌ హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా ఆయన మద్దతుదారులు గాంధీభవన్‌లో ఆందోళన కూడా నిర్వహించారు. మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి కూడా రేసులో అందరికంటే ముందున్నారు. యువకుడు కావడంతో పాటు రాష్ట్రంలో మంచి క్రేజ్‌ ఉన్న నేతగా ఆయనకు అవకాశం ఇస్తారనే చర్చ కూడా జరుగుతోంది. రేవంత్‌ అభ్యర్థిత్వానికి అధిష్టానం నుంచి ఎలాంటి అభ్యంతరం లేక పోయినా కొందరు స్థానిక నేతలు అడ్డు తగులుతున్నారని సమాచారం.

ఇక, సౌమ్యుడిగా ముద్ర పడిన మాజీ మంత్రి శ్రీధర్‌బాబు కూడా టీపీసీసీ రేసులో ముందు వరుసలోనే ఉన్నారు. శ్రీధర్‌బాబుకు అధ్యక్ష పదవి కోసం రాష్ట్ర పార్టీలోని కొందరు కీలక నేతలు ప్రయత్నిస్తున్నారని, ఆయనకు మద్దతుగా ఇద్దరు కీలక నేతలు లేఖలు కూడా ఇచ్చారని గాంధీ భవన్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వీరితో పాటు పలువురు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన నాయకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. బీసీ సామాజిక వర్గాలకు చెందిన కాంగ్రెస్‌ నేతలు ఒక్కతాటిపైకి వచ్చి ఈసారి తమకు అవకాశం ఇవ్వాల్సిందేనని అడుగుతున్నారు. ఇందు కోసం హైదరాబాద్‌ వేదికగా ఇటీవల సంయుక్తంగా సమావేశం కూడా నిర్వహించారు.

వీటన్నింటి నేపథ్యంలో కాబోయే టీపీసీసీ చీఫ్‌ ఎవరు.. అధిష్టానం ఏ వర్గానికి ప్రాధాన్యమిస్తుంది.. సామాజిక అంశాలను బేరీజు వేసుకుంటుందా, చరిష్మా ఆధారంగా పదవి కట్టబెడు తుందా అన్నది కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఆసక్తి కలిగిస్తోంది. కాగా ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ మళ్లీ బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏఐసీసీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తారని, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జులను కూడా దేశ వ్యాప్తంగా మార్పు చేస్తారని తెలుస్తోంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!