వికేంద్రీకరణతోనే పురోభివృద్ధి
పాలనా పరంగా వికేంద్రీకరణతోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని జీఎన్ రావు కమిటీ స్పష్టం చేసింది. ఆంధ్ర ప్రదేశ్ లో అన్ని ప్రాంతాలు సమానంగా డెవలప్ మెంట్ జరిగేలా చూడాలని కోరింది. అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడీషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలని సూచించింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, రాజధాని, పరిపాలన వికేంద్రీకరణపై ఏర్పాటైన ఈ నిపుణుల కమిటీ 125 పేజీలతో కూడిన నివేదికను సమర్పించింది. రాష్ట్రంలోని 13 జిల్లాల సమగ్రాభివృద్ధి ప్రతిబింబించేలా నివేదికలో పలు సూచనలు చేసింది.
విశాఖపట్నంలో సచివాలయం, సీఎం క్యాంపు కార్యాలయం, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని, వేసవిలో అక్కడే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని పేర్కొంది.
అమరావతిలో అసెంబ్లీ, గవర్నర్ కార్యాలయం, సీఎం క్యాంపు కార్యాలయం, కర్నూలులో హైకోర్టు ఉండాలని సూచించింది. వరద ముంపులేని ప్రాంతం రాష్ట్రానికి రాజధానిగా ఉండాలని.. రాజధాని కార్యకలాపాల్ని వికేంద్రీకరించాలని సలహానిచ్చింది. కమిటీ మొత్తం సుమారు 10,600 కిలోమీటర్లు రాష్ట్రమంతా పర్యటించి రాజధాని, అభివృద్ధి అంశాలపై అధ్యయనం చేసింది. మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్‌లో ఉన్నట్టు రాష్ట్రంలో అమరావతి, విశాఖపట్నంలో శాసన వ్యవస్థ ఉండాలి. అసెంబ్లీ అమరావతిలో ఉన్నా.. వేసవి కాల సమావేశాలు విశాఖలో నిర్వహించాలి. విశాఖపట్నంలో సచివాలయం, హెచ్‌ఓడీ కార్యాలయాలు, సీఎం క్యాంపు కార్యాలయం, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి. అమరావతిలో అసెంబ్లీతో పాటు హైకోర్టు బెంచ్, సీఎం క్యాంపు కార్యాలయం, రాజ్‌భవన్ ఉండాలి.
శీతాకాల అసెంబ్లీ సమావేశాలు అమరావతిలో నిర్వహించాలి. అమరావతిలో భూమి తీరు, వరద ప్రభావం తదితర అంశాల కారణంగా రాజధాని కార్యకలాపాల్ని ఇతర నగరాలకు వికేంద్రీకరించాలి. ఇక్కడ దాదాపుగా పూర్తైన నిర్మాణాలను వినియోగంలోకి తీసుకురావాలి. అమరావతిలో ప్రతిపాదిత నిర్మాణాల్ని తగ్గించాలి. ఎన్జీటీ ఆదేశాల ప్రకారం రివర్ ఫ్రంట్ నిర్మాణాలు ఉండరాదు. వరద ముంపు నుంచి రక్షణ కోసం చేపట్టిన నిర్మాణాలు పూర్తి చేయాలి. సీడ్ యాక్సిస్ రోడ్డును నేషనల్ హైవేకు అనుసంధానించాలి. శ్రీబాగ్ ఒడంబడికను గౌరవించేలా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో చాలా ప్రాంతీయ అసమానతలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు చాలా వెనకబడితే.. మరికొన్ని అభివృద్ధిలో దూసుకు పోతున్నాయి.
వాటి మధ్య సమతూకం సాధించాలి. ఇందు కోసం రెండంచెల వ్యూహాన్ని సూచించాం. ఆంధ్రప్రదేశ్‌కు సుదీర్ఘమైన తీర ప్రాంతంతో పాటు పలు నదులు, అడవులు ఉన్నాయి. అభివృద్ధి వల్ల పర్యావరణం పాడవకుండా పలు సూచనలు చేశాం. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. ఇదిలా ఉండగా స్పెషల్ ఎకనమిక్ జోన్స్ ఏర్పాటు చేయాలని సూచించింది. శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం మూడు జిల్లాలను ఉత్తరాంధ్ర జోన్ గా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిలాలలను మధ్య కోస్తా ప్రాంతంగా, గుంటూరు, ప్రకాశం , నెల్లూరు జిల్లాలను దక్షిణ కోస్తాగా కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలను రాయలసీమ ప్రాంతంగా ప్రత్యేక అభివృద్ధి మండళ్ళుగా ఏర్పాటు చేయాలని కోరింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి