నిత్యానందం..నిత్యం నరకం


మనుషుల బలహీనతలు కోట్లు కురిపించేలా చేస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇండియాలో స్వాములు ఎక్కువ. భక్తి ఒకప్పుడు కొంత వరకే పరిమితమై ఉండేది. దానికో సామాజిక బాధ్యత ఉండేది. ఆశ్రమాలు విద్య, విలువల పరిరక్షణ, సంస్కృతి, సాంప్రదాయాలు, వేదాలు, ఉపనిషత్తుల సారం బోధించే వారు. కఠిన నియమ నిబంధనల మధ్య ఆధ్యాత్మిక శోభ విరాజిల్లేది. కానీ ఇప్పుడు భక్తి, సంస్కృతి, ఆధ్యాత్మికత అంతా ఫక్తు వ్యాపారమై పోయింది. మాయమాటలు చెబుతూ బురిడీ కొట్టించడం, భక్తులకు అతీంద్రియ శక్తుల పేరుతో శఠగోపం పెట్టడం, మోసాలకు గురి చేయడం చేస్తూ వస్తున్నారు.

ఏ ఆశ్రమం చూసినా భక్తులతో కిటకిట లాడుతోంది. స్వాములకు దేశాధి నేతలకంటే ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటోంది. ప్రతి ఒక్కరికీ ఈజీగా సంపాదించే మార్గం స్వామీజీలుగా అవతారం ఎత్తడం. ఇప్పుడు భక్తి మార్గం దేశాన్ని దాటి, సముద్రాల అవతలకు చేరుకుంది. నాటి చంద్ర స్వామిజీ నుండి నిన్నటి నిత్యానంద స్వామీజీ దాకా పలు అవినీతి, లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నారు. లెక్కలేనన్ని ఆస్తులు కూడ బెట్టారు. దేశంలోని ప్రధాన నగరాలలో ఆశ్రమాలు ఏర్పాటు చేసుకున్నారు. పూజల పేరుతో, యాగాలు, యజ్ఞాల పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. భక్తుల బలహీనతలు ఆసరాగా చేసుకుని స్కామ్ లకు పాల్పడుతున్నారు.

వాడ వాడల దేవుళ్ళు వెలిశారు. ప్రతి చోటా ఆలయాలు ఏర్పాటు అయ్యాయి. మోసాలకు పాల్పడే వారు స్వామీజీల అవతారం ఎత్తారు. కొందరు జైలుకు వెళ్లారు. చాలా మందిపై లైంగిక వేధింపులకు పాల్పడటం ఎక్కువగా ఆందోళన కలిగిస్తోంది. వీరికి రాజకీయ పార్టీలు, అధినేతలు, కార్పొరేట్ కంపెనీలు, వ్యాపారవేత్తలు భక్తులుగా ఉన్నారు. ఇప్పుడు ఆశ్రమాలు అన్నీ ఫైవ్ స్టార్ హోటల్స్ ను తలపిస్తున్నాయి. తాజాగా ఆధ్యాత్మిక గురువు నిత్యానంద ఆశ్రమంలో జరుగుతున్న అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. విద్య పేరుతో బాలికలను ఆశ్రమంలో చేర్పించుకుని.. వారి ద్వారా విరాళాలు సేకరించేందుకు అవలంబిస్తున్న విధానాలను బెంగళూరుకు చెందిన బాధితురాలు వెల్లడించింది.

ఇదే నగరానికి చెందిన జనార్ధన శర్మ దంపతులు తమ నలుగురు కూతుళ్లను 2013లో నిత్యానంద ఆశ్రమానికి చెందిన విద్యా సంస్థలో చేర్పించారు. ఆశ్రమ నిర్వాహకులు ఇటీవల ఆ నలుగురిని గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న యోగిన సర్వ ఙ్ఞాన పీఠానికి బదిలీ చేశారు. విషయం తెలుసుకన్న శర్మ దంపతులు కూతుళ్లను కలిసేందుకు వెళ్లగా అందుకు నిరాకరించారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించి ఇద్దరు మైనర్‌ కూతుళ్లను ఇంటికి తీసుకువచ్చారు. మేజర్లు అయిన మరో ఇద్దరు కూతుళ్లు మాత్రం వారి వెంట రావడానికి నిరాకరించారు. ఈ క్రమంలో తమ కూతుళ్లను విడిపించాల్సిందిగా శర్మ దంపతులు గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించారు.

శర్మ దగ్గరికి వచ్చిన ఒకరు నోరు విప్పారు. నిత్యానంద ఆశ్రమంలో మానసికంగా, శారీరకంగా తమను వేధింపులకు గురి చేసే వారని వాపోయింది. 2013లో గురుకులంలో చేరాను. మొదట్లో అన్నీ బాగానే ఉండేవి. చాలా సరదాగా గడిచి పోయేది. 2017 నుంచి మాకు నరకం మొదలైంది. స్వామీజీకి విరాళాలు సేకరించేందుకు మాతో ప్రమోషనల్‌ వీడియోలు చేయించారు. లక్షల్లో విరాళాలు వచ్చేలా నటించాలంటూ ఇబ్బంది పెట్టారు. 3 లక్షల నుంచి ప్రారంభమై 8 కోట్ల వరకు విరాళాలు వచ్చేవి. నగదు చెల్లించలేని వాళ్లు భూముల రూపంలో అది కూడా ఎకరాల్లో దానంగా ఇచ్చారు. ఆ వీడియోల కోసం అర్ధరాత్రి మమ్మల్ని నిద్ర లేపే వారు.

మాకు మేకప్‌ వేసి.. పెద్ద పెద్ద నగలు అలంకరించి స్వామీజీ వద్దకు తీసుకు వెళ్లే వారు. మా అక్కను కూడా అలాగే చేశారు. నా ముందే తనతో వీడియోలు చేయించే వారు. మా అమ్మా నాన్నలకు వ్యతిరేకంగా మాట్లాడాలని వేధించారు. నన్ను కూడా అలాగే చెప్పమన్నారు కానీ నేను వినలేదు. దీంతో ఇష్టం వచ్చినట్లుగా, అసభ్య రీతిలో దూషించారని వాపోయింది. మరోవైపు నిత్యానంద పరారీలో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నకిలీ పాస్‌పోర్టు ఉపయోగించి ఆస్ట్రేలియా దగ్గర్లోని ద్వీపానికి వెళ్లినట్లు వార్తలు వెలువడుతున్నాయి. పోలీసులు మరిన్ని సోదాలు చేస్తీ ఇంకెన్ని మోసాలు, బాధితులు బయటపడే అవకాశం ఉంది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!