అబ్బా అజిత్ దెబ్బ

పాలిటిక్స్ లో ప్రత్యక్ష పోరాటాలు ఉండవు. వెన్ను పోట్లు తప్ప దాడులంటూ చూసేందుకు వుండవు. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ సాగే సన్నివేశాలు అటు సినిమాల్లో ఇటు చదరంగం ఆటలో మాత్రమే అగుపిస్తాయి. ఈ దేశంలో ఇలాంటి డిఫెరెంట్ ఈక్వేషన్స్ తో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు దేశవ్యాప్తంగా చోటు చేసు కుంటున్నాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాలనలో కొత్తదనం చోటు చేసుకుంటుందని అంతా భావించారు. కానీ అందుకు విరుద్దంగా మోడీ, అమిత్ చంద్ర షా ల ద్వయం పావులు కదుపుతూ వస్తోంది. నిన్నటి దాకా కర్ణాటకలో ఏర్పడిన సంకీర్ణ సర్కారుకు కమలం కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చింది.

ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన మరాఠా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఏ ఒక్క పార్టీకి పూర్తి స్థాయిలో మెజారిటీ రాక పోవడంతో గవర్నర్ పాలన విధించారు. ప్రభుత్వ ఏర్పాటుకు నిన్నటి దాకా బద్ద శత్రువులైన ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో శివసేన చేతులు కలిపింది. సర్కార్ ఏర్పాటుకు సై అంది. ఇండియాలో ట్రబుల్ షూటర్ గా పేరొందిన అమిత్ షా శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే కు దిమ్మ తిరిగేలా ఝలక్ ఇచ్చారు. బీజేపీతో ఎన్సీపీ పార్టీలోని అసమ్మతి ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చేలా పావులు కదిపారు. దీంతో విస్తు పోవడం శరద్ పవార్, ఉద్దవ్ ల పనైంది. పవార్ కు కోలుకోలేని విధంగా షాకిచ్చిన మరో నేత అజిత్ పవార్.

ఆయన తండ్రి అనంత్‌రావ్‌ పవార్‌ కొన్నాళ్ల పాటు ప్రముఖ దర్శకుడు వి. శాంతారాం దగ్గర పని చేశారు. ఆ సినీ వాసన లేమైనా వంట బట్టాయో ఏమో, అజిత్‌ బాలీవుడ్‌ థ్రిల్లర్‌ని తలదన్నేలా మహా రాజకీయాన్ని నడిపారు. ఇన్నాళ్లూ చిన్నాన్న శరద్‌ పవార్‌ నీడలో కలిసి పోయారు. రాజకీయం నేర్పిన చిన్నాన్నకే ఝలక్‌ ఇచ్చి ఉప ముఖ్యమంత్రి పదవిని దక్కించు కున్నారు. శరద్‌ అనే వటవృక్షం నీడ నుంచి తప్పుకోవాలని అజిత్‌ భావిస్తున్నారని ఎప్పట్నుంచో రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అజిత్‌ సొంత పార్టీ పెడతారనీ గతంలో వార్తలొచ్చాయి. మహారాష్ట్ర సీఎం కావాలని అజిత్‌ పవార్‌ ఎప్పట్నుంచో కలలు కంటున్నారు. 2004, 2009లో కాంగెస్, ఎన్సీపీ సర్కార్‌ అధికారంలోకి వచ్చినా ఆయన కల నెర వేరలేదు.

అప్పట్నుంచే తన రాజకీయ లక్ష్యాలను చేరుకోవడానికి అజిత్‌ పవార్‌ పావులు కదుపుతున్నట్టుగా ప్రచారంలో ఉంది. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ తీరుపై అజిత్‌కు ఎప్పట్నుంచో అసంతృప్తి నెలకొని ఉంది. పవార్‌ తన కుమార్తె సుప్రియా సూలెకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని, తన కుమారుడు పార్థ్‌ పవార్‌ విషయంలో చాలా అనాసక్తిగా ఉన్నారని అజిత్‌ లోలోపల రగిలి పోతున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పవార్‌ కుమారుడు పార్థ్‌ ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మావల్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేసి చిత్తుగా ఓడి పోయారు.

పార్థ్‌ ఓటమికి తన చిన్నాన్నే కారణమని అజిత్‌ నిందించినట్టుగా అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. ప్రజాకర్షణ కలిగిన నాయకుడిగా అజిత్‌ పవార్‌కు పేరుంది. జిల్లాలో బారామతి గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అజిత్‌ పవార్‌ వరసగా ఏడు సార్లు అక్కడ నుంచే గెలుపొంది రికార్డు సృష్టించారు. 60 ఏళ్ల వయసున్న అజిత్‌ పవార్‌ ఈ సారి ఎన్నికల్లో 1.65 లక్షల మెజార్టీతో నెగ్గి నియోజకవర్గంపై తనకున్న పట్టుని మరోసారి చాటుకున్నారు. ఆయనకున్న నాయకత్వ లక్షణాల కారణంగా అభిమానులు ఆయనను దాదా అని ఆప్యాయంగా పిలుచుకుంటారు.

1959, జులై 22న రైతు కుటుంబంలో పుట్టిన అజిత్‌ పవార్‌ విద్యాభ్యాసం అంతా బోంబేలోనే సాగింది. 1982లో తొలిసారి రాజకీయాల్లోకి వచ్చి షుగర్‌ ఫ్యాక్టరీ కోపరేటివ్‌ బోర్డు సభ్యుడయ్యారు. 1991లో బారామతి లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికయ్యారు. అయితే తన చిన్నాన్న కోసం లోక్‌సభ పదవిని వదులుకొని అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో మంత్రి పదవుల్ని సమర్థంగా నిర్వహించారు. 1991లో తొలిసారిగా సుధాకర్‌ రావు నాయక్‌ ప్రభుత్వ హయాంలో మంత్రి అయ్యారు. వ్యవసాయం, గ్రామీణ భూ పరిరక్షణ, విద్యుత్, సాగునీరు వంటి శాఖల మంత్రిగా పనిచేశారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!