ట్రావెలర్స్ కు అరుదైన ఛాన్స్

ప్రయాణం జీవితంలో భలే జ్ఞాపకాలను మిగిలిస్తుంది. కొత్త ప్రదేశాలు, అరుదైన దేవాలయాలు, పర్యాటక స్థలాలు ఎప్పటికీ పర్యాటకులతో కళకళలాడుతూనే ఉంటాయి. ఇందు కోసం కొందరు బస్సులు, రైళ్లు, విమానాలు ఆశ్రయిస్తే మరికొందరు తమ స్వంత వాహనాల్లో వెళ్లడం పరిపాటి. తాజగా నగర పర్యాటకుల కోసం రైల్వే శాఖ ‘భారత్‌ దర్శన్‌’ పేరుతో ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. అది త్వరలో పట్టా లెక్కనుంది. దేశ వ్యాప్తంగా ఉన్న పర్యాటక స్థలాలు, పుణ్య క్షేత్రాల సందర్శనకు వీలుగా ఈ రైలు సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రైల్వే శాఖ తొలిసారి దక్షిణ మధ్య రైల్వేకు కేటాయించిన పర్యాటక రైలు ఇది.

ఈ రైలు పర్యాటక ప్యాకేజీల రూపకల్పన, నిర్వహణను ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజమ్‌ కార్పొరేషన్‌  పర్యవేక్షిస్తుంది. హైదరాబాద్‌ పర్యాటకుల అభిరుచికి అనుగుణంగా, దేశంలోని వివిధ ప్రాంతాల వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని టూర్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఐఆర్‌సీటీసీ వెల్లడించింది. మొదట దక్షిణ భారత యాత్రకు శ్రీకారం చుట్టింది. దశల వారీగా దేశ వ్యాప్తంగా ఈ పర్యాటక రైలు పయనిస్తుందని తెలిపింది. మన నగరం నుంచి ఏటా 50 వేల మందికి పైగా పర్యాటకులు ఉత్తర, దక్షిణ భారత యాత్రలకు రైళ్లలో తరలి వెళ్తున్నారు. ఆయా ప్రాంతాలకు వెళ్లాలంటే ఒక్కోసారి రెండు, మూడు రైళ్లు మారాల్సి వస్తోంది.

దీంతో కుటుంబాలతో కలిసి ఎక్కువ లగేజీతో వెళ్లవలసి వచ్చినప్పుడు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు ప్రత్యేక రైల్వే సదుపాయాలు లేక పోవడంతో ప్రైవేట్‌ టూరిస్టు సంస్థలపై ఆధార పడాల్సి వస్తోంది. ఈ సంస్థల ప్యాకేజీలు ఖరీదైనవి కావడమే కాక కొన్నిసార్లు మోసాలూ జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నగర పర్యాటకుల డిమాండ్‌ మేరకు దక్షిణ మధ్య రైల్వేకు ప్రత్యేక పర్యాటక రైలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. ఎట్టకేలకు దక్షిణ మధ్య రైల్వేకు సొంతంగా పర్యాటక రైలు రావడంతో ఇక ఇబ్బందులు తొలగినట్లేనని రైల్వే ఉన్నతాధికారులు చెబుతున్నారు.

సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరే ఈ రైలు వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా మొదట శ్రీరంగం చేరుతుంది. శ్రీరంగనాథ స్వామి, తంజావూర్‌ బృహ దీశ్వరాలయ పర్యటన ఉంటుంది. అక్కడి నుంచి 2,500 ఏళ్ల నాటి పురాతన పట్టణమైన మధుర మీనాక్షి ఆలయానికి చేరుకుంటుంది. రామేశ్వరం రామనాథ స్వామి ఆలయం, కన్యాకుమారిలోని కుమారి అమ్మన్‌ దేవాలయం, వివేకానంద రాక్‌ మెమోరియల్‌ తో పాటు మహా బలిపురంకు ఈ రైలు చేరుకుంటుంది. అనంతరం కాంచీపురం చేరుకొని అక్కడి నుంచి తిరుగు పయనమవుతుంది. జనవరి 3, తెల్లవారు జామున సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి బయల్దేరుతుంది. 10న మధ్యాహ్నం తిరిగి సికింద్రాబాద్‌ చేరుతుంది.

ప్రయాణం మొత్తం 7 రాత్రులు, 8 పగళ్లు సాగుతుంది. ఈ రైలుకు ఉండే 16 బోగీల్లో 12 స్లీపర్‌ క్లాస్, ఒక ఏసీ త్రీటైర్, ఒక ప్యాంట్రీ కార్‌ ఉంటాయి. మిగతా రెండూ గార్డ్‌ బోగీలు. స్లీపర్‌ క్లాస్‌ జర్నీకి రోజుకు రూ.945, థర్డ్‌ ఏసీకి రూ.1,150 చొప్పున చార్జీ వసూలు చేస్తారు. మొత్తంగా 8 రోజుల దక్షిణ భారత యాత్ర కోసం స్లీపర్‌ క్లాస్‌కు 7,560 రూపాయల చార్జీ ఉండగా థర్డ్‌ ఏసీకి 9,240 చొప్పున ప్యాకేజీ నిర్ణయించారు. ఈ అద్భుత మైన యాత్ర చేయాలనుకునే వారు సికింద్రాబాద్‌ ఐఆర్‌సీటీసీ జోనల్‌ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. లేదా ఎంక్వయిరీ కోసం 82879 32227, 82879 32228 ఫోన్లలో సంప్రదించి బుకింగ్ చేసుకోవచ్చు.  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!