మరాఠాలో మహా ట్విస్ట్
మరాఠా పాలిటిక్స్ బాలీవుడ్ సినిమాను గుర్తుకు తెస్తున్నాయి. ఫడ్నవిస్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి శివసేనకు కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఇదిలా ఉండగా తెరపైకి ఎన్సీపీ, శివసేన చీఫ్ లు ఉద్దవ్ ఠాక్రే, పవార్ లు వచ్చారు. తమకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ పార్టీలకు సరిపడా సంఖ్యా బలం ఉందని పేర్కొన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ , డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో వీరిద్దరూ మాట్లాడారు. ఫడ్నవిస్ ప్రభుత్వ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమని ధ్వజ మెత్తారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు అజిత్ పవార్‌ను ఎన్సీపీ నుంచి బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు.
తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడికీ వెళ్లలేదని స్పష్టం చేశారు. మా పార్టీ ఎమ్మెల్యేలు మాతోనే ఉన్నారు. మేం ఏర్పాటు చేయబోయే సంకీర్ణ ప్రభుత్వానికి స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా మద్దతునిచ్చారు. అయితే తెల్ల వారే లోగా పరిస్థితులు మారి పోయాయి. రాష్ట్రపతి పాలన ఎత్తి వేసినట్లు ఆరున్నరకు తెలిసింది. మా ఎమ్మెల్యేలలో కొంత మందితో కలిసి అజిత్ పవార్ రాజ్ భవన్‌కు వెళ్లారు. ఇది పార్టీ నిర్ణయానికి వ్యతిరేకం. అక్కడున్న వాళ్లతో అజిత్ మాట్లాడిస్తున్నారు. బహుశా ఆయన వెంట 10 నుంచి 11 మంది ఎమ్మెల్యేలు ఉండి ఉంటారు అంతే. అయితే వాళ్లంతా అనర్హత వేటు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అసెంబ్లీలో బీజేపీ బల నిరూపణ చేసుకోలేదు.
కాబట్టి మాకు అవకాశం ఉంటుంది అని తెలిపారు. బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ చేతులు కలిపేది లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాజ్ భవన్‌కు వెళ్లిన కొంతమంది ఎన్సీపీ ఎమ్మెల్యేలతో మాట్లాడించారు. అజిత్ పవార్ ఫోన్ చేసి రాజ్ భవన్‌కు రమ్మంటే వెళ్లాం. అయితే అప్పటికే అక్కడ ప్రమాణ స్వీకార ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడున్న వాతావరణంతో మేం షాక్‌కు గురయ్యాం. మేం అజిత్ వెంట వెళ్లడం లేదు. మా మద్దతు శరద్ పవార్‌కే అని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. మరోవైపు ప్రస్తుతం పరిణామాల పై చర్చించేందుకు సమావేశం కానున్నారు. కాగా ఈ శివసేన, ఎన్సీపీ ఉమ్మడి సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నేతలెవరూ హాజరు కాక పోవడం గమనార్హం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి