జయహో బాజీ..సలాం సెహ్వాగ్

ఈ దేశం వీరులను కన్నది. జాతిని, కోట్లాది ప్రజలను ఒకే జెండా కింద చేరుస్తుంది ఒకే ఒక్క ఆట అదే క్రికెట్. కోట్లా రూపాయలు, లెక్కలేనంతటి ప్రచారం, కావాల్సినంత సౌకర్యాలు ఆటగాళ్లకు స్వంతం. ఎక్కుమంది క్రికెటర్లు ఆదాయం పైన దృష్టి పెడతారు. కానీ తమకూ ఈ దేశం పట్ల బాధ్యత ఉందని మరోసారి గుర్తు చేశారు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.చిల్డ్రన్స్ డే సందర్భంగా ఆయన ఓ ఫోటోను షేర్ చేశారు. ఇది దేశ వ్యాప్తంగా వైరల్ గా మారింది. లక్షలాది మంది నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది. 1938లో బ్రిటీష్‌ తుపాకీ తూటాలకు బాజీ రౌత్‌ అనే బాలుడు బలై పోయాడు. ఆ బాలుడిని స్మరించుకుంటూ సెహ్వాగ్‌ చేసిన పోస్టు మానవత్వం ఉన్న ప్రతీ ఒక్కరి చేత కంట తడి పెట్టిస్తోంది.

దేశ రక్షణ కోసం బాల్యం లో అతడు చూపిన ధైర్య సాహసాలను సెహ్వాగ్‌ కొనియాడారు. బాలల దినోత్సవం రోజున బాజీని గుర్తు చేసు కోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సెహ్వాగ్ స్పష్టం చేశారు. అతి పిన్న వయస్సు లోనే ప్రజల రక్షణ కోసం ప్రాణాలు విడిచిన బాజీని భారతదేశపు స్వాతంత్ర్య కోసం జరిగిన పోరాటంలో తొలి అమరుడిగా అభివర్ణించాడు. ఒడిశాలోని నీలకాంతపూర్‌కు చెందిన అమరుడు బాజీ రౌత్‌. తనకు పన్నెండేళ్లు ఉన్నపుడు, ఓ బ్రిటీష్‌ దళం పడవలో ఎక్కించుకుని బ్రాహ్మణి నది అవతలి తీరానికి తీసుకు వెళ్లాల్సిందిగా అడిగింది. అదే దళం ఎంతో మంది అమాయకులను పాశవికంగా చంపిందంటూ కథలు విన్నాడు బాజీ. తీరం దాటితే ఇంకెంతో విధ్వంసం సృష్టిస్తారోనని ఆలోచించాడు.

తీరం దాటించే ప్రసక్తే లేదని చెప్పాడు. చంపేస్తామంటూ బ్రిటీష్‌ సేనలు బాజినీ భయ పెట్టాయి. బాజీ వారికి తలొగ్గలేదు. వాళ్ల మాటలకు ఎదురు చెప్పాడు. ఓ బ్రిటీష్‌ సైనికుడు బాజీ తల మీద తుపాకీ వెనుక భాగంతో గట్టిగా కొట్టాడు. అతడు కింద పడి పోయాడు. బాజీ మెల్లగా శక్తినంతా కూడగట్టుకుని పైకి లేచి.. తాను బతికున్నంత కాలం వాళ్లను అవతలి తీరానికి చేర్చేది లేదని తేల్చి చెప్పాడు. అప్పుడు వెంటనే ఓ సైనికుడు తన కత్తిని బాజీ తలలోకి దింపగా, మరొకడు ఆ చిన్నారిపై బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఈ ఘటనలో బాజీతో పాటు అక్కడే ఉన్న అతడి స్నేహితులు లక్ష్మణ్‌ మాలిక్‌, ఫగూ సాహో, హృషి ప్రదాన్‌, నాటా మాలిక్‌ కూడా మృత్యువాత పడ్డారు.

బాలల దినోత్సవం నాడు ఆ ధైర్యశాలికి సెల్యూట్‌ చేస్తున్నా. అత్యంత పిన్న వయసులో అసువులు బాసిన ఆ అమరుడు మరింత గుర్తింపునకు అర్హుడు అంటూ సెహ్వాగ్‌ తన ఇన్‌స్టా పోస్టులో రాశాడు. అతడి త్యాగం మరవలేనిది. ఆ అమాయకపు ముఖం కంట తడి పెట్టిస్తోంది. మీకు ధన్యవాదాలు వీరూ భాయ్‌ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బాజీ రౌత్‌ ఒడిశాలోని నీలకాంత్‌పూర్‌లో 1926లో జన్మించాడు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోగా, అతడి తల్లి ఇళ్లల్లో పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించేది. ఈ క్రమంలో 1938లో బాజీ రౌత్‌ బ్రిటీష్‌ సేనల చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. ఇదీ చరిత్ర. ఓ బాలుడు వీరుడిగా మారిన ధీరోదాత్తమైన కన్నీటి కథ. అతడితో పాటు వీర మరణం పొందిన పిల్లలు కూడా అసువులు బాశారు. దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన ఈ వీరులకు సలాము చేద్దాం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!