మరాఠా యోధుడికి పరీక్ష
మరాఠా పీఠంపై కొలువు తీరిన శివ సైనికుడికి అగ్ని పరీక్ష నెలకొంది. మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఎదుర్కోనుంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల కూటమి ‘మహా వికాస్ ఆఘాడి’ గా సంకీర్ణ సర్కార్ ను ఏర్పాటు చేశాయి. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ అసెంబ్లీలో బల నిరూపణకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే మెజారిటీని నిరూపించు కునేందుకు ఉద్ధవ్ ఠాక్రే సిద్ధమయ్యారు. కాగా, ఎన్సీపీ ఎమ్మెల్యే దిలీప్ వాల్సే పాటిల్‌ను కొత్త ప్రొటెం స్పీకర్‌గా నియమించారు. ఫడ్నవీస్ ప్రభుత్వం నియమించిన ప్రొటెం స్పీకర్ కాళిదాసు కొలాంబ్కర్ స్థానంలో పాటిల్‌కు బాధ్యతలు అప్పగించారు.
ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన దిలీప్ పాటిల్ గతంలో అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే లాంఛనంగా అధికార బాధ్యతలు చేపట్టారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. మొత్తం 288 సీట్లలో మెజారిటీకి అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్య 145. ఎన్నికల్లో శివసేనతో కలిసి పోటీ చేసిన బీజేపీ 105 స్థానాల్లో గెలుపొందింది. ఇతర రాజకీయ పక్షాలతో పొత్తు పెట్టు కోవడం పార్టీల హక్కు అని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రజాస్వామ్యంలో పార్టీలకున్న ఆ హక్కును తొలగించలేమని వ్యాఖ్యానించింది. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ఎన్నికల అనంతరం జట్టు కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది.
రాజకీయ నైతికత, రాజ్యాంగ నైతికత వేర్వేరని, వాటిని పోల్చలేమని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. శివసేన, బీజేపీ ఎన్డీయే భాగస్వామ్యులుగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేశాయని పిటిషన్‌దారు అఖిల భారత హిందూ మహాసభ తరఫు న్యాయవాది బీకే సిన్హా తెలిపారు. ప్రత్యర్థులుగా పోటీ చేసిన వారితో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సరికాదని ఆయన వాదించగా తమ పరిధిలోకి రాని ఎన్నికల అనంతర పొత్తుల్లోకి లాగవద్దని దర్మాసనం తెలిపింది. మేనిఫెస్టోలను అమలు చేయాలంటూ పార్టీలను కోర్టులు ఆదేశించలేవని కూడా పేర్కొంది.
ఇదిలా ఉండగా మహారాష్ట్ర తరువాత తమ తదుపరి లక్ష్యం గోవా యేనని శివసేన నేత సంజయ్ రౌత్ ప్రకటించారు. గోవాలో కూడా బీజేపీయేతర సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. మహారాష్ట్ర వాది గోమంతక్ పార్టీ, గోవా ఫార్వర్డ్ పార్టీ నేతలతో రౌత్ చర్చలు జరిపారు. ఈ రెండు పార్టీలు కూడా గతంలో బీజేపీ మిత్రపక్షాలే కావడం విశేషం. జీఎఫ్‌పీ చీఫ్ విజయ్ సర్దేశాయితో భేటీ అనంతరం రౌత్ మాట్లాడారు. త్వరలో పెద్ద భూకంపం రానుంది. సర్దేశాయి తన ఎమ్మెల్యేలతో ఇక్కడే ఉన్నారు. గోవాలో బీజేపీకి మద్దతిస్తున్న మరి కొందరు ఎమ్మెల్యేలు కూడా మాతో టచ్‌లో ఉన్నారు అని బాంబు పేల్చారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి