చిన్న జీయర్ ఆశీర్వాదం..జన్మ ధన్యం
ఎక్కడికో వెళ్లడం దేని కోసం. ఉన్న చోటును గుర్తించం. లేనిదాని కోసం ఆరాట పడతాం. అంతులేనిది ఏదో ఉందన్న భ్రమల్లో బతుకుతాం. ఇదే మానవుల్ని ఇబ్బందులకు లోను చేస్తోంది. అందని దాని కోసం అర్రులు చాచడం. ఎదుటి వారి పట్ల ప్రేమను కలిగి ఉండక పోవడం, ఈర్ష్య విద్వేషాలతో అద్భుతమైన, దేవుడు ప్రసాదించిన ఈ జీవితానికి దూరంగా ఉంటున్నారు. ఇది కాదు మన ప్రయాణం. ఇది కాదు మన సంస్కృతి. వేదాలు, ఇతిహాసాలు మనం ఎలా ఉండాలో, ఏది ఎప్పుడు చేయాలో..సమాజంలో మన బాధ్యత ఏమిటో గుర్తు చేస్తాయి. నీతి, నిబద్దత, ధర్మాన్ని గతి తప్పకుండా చేసేందుకు ఇవి దోహదం చేస్తాయి. ఇది కాదనలేని సత్యం. వర్షం వచ్చినప్పుడు నీళ్లు ఎలా ప్రవహిస్తూ వుంటాయో మీ అందరి మనస్సులో కోరికలు, ఆలోచనలు అలాగే కదులుతూ ఉంటాయి.
దీనిని నిలువరించి అడ్డుకట్ట వేసే మార్గాన్ని భక్తి అనే సాధనం చేస్తుంది. దీనిని గుర్తించి సాధన చేయగలిగితే మీకు మీరుగా ఏ ఒక్కరి సహాయమూ లేకుండా మీ అంతటా మీరే గొప్ప సాధకులుగా మారే అవకాశం ఉన్నది. ఇదంతా నిరంతరం సాగే దైనందిన ప్రక్రియ. జీవన యానంలో ప్రతిదీ మనల్ని పలకరిస్తుంది. పరవశించేలా చేస్తుంది. ఇదంతా బాహ్య రూపకంగా అగుపించే సన్నివేశం. కానీ లోపట ఉండే మనసు మాత్రం గెంతులు వేస్తూ ఉంటుంది. ఈ ప్రక్రియ గత కొన్నేళ్లుగా, తరతరాలుగా అంటి పెట్టుకునే ఉంటోంది. ఇది ఒక పట్టాన నిలువ నీయదు. కుదురుగా కూర్చో నివ్వదు. కానీ జీవితంలో స్థిరపడాలని ప్రతి ఒక్కరికీ కోరిక, ఆశ ఉండటం మామూలే. సహజం కూడా.
ఎదగాలన్నా లేదా పై స్థాయికి చేరు కోవాలన్నా మనసు, శరీరమూ రెండూ ఏక కాలంలో సమపాళ్లలో పని చేయ గలగాలి. ఇదంతా జరగాలంటే లోలోపట మిమ్మల్ని మీరు సాధనా పరులుగా మార్చు కోవాలి. ఇదంతా ఆచరణ లోకి రావాలంటే, విధిగా మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలి. అది ఓ రకంగా యజ్ఞం, యాగం లాంటిది. ఇదేమంత కష్టమైనది కాదు కూడా. కావాల్సిందల్లా మీకు మీరుగా సంకల్ప బలాన్ని కలిగి ఉండేలా చేసు కోవడం. ఇదంతా ఒకే ఒక్క రోజులోనో సాధ్యమయ్యేది కాదు. కొంత సమయం పడుతుంది. ఇందు కోసం ధర్మబద్ధంగా ఉండాలి. నియమాను సారంగా, పద్ధతి తప్పకుండా ఆచరించాలి. లేదా ధర్మబద్దులై, సమాజ హితం కోసం, ఆధ్యాత్మిక సాగరాన్ని ఈదుతున్న వాళ్ళు లేదా సర్వసంగ పరిత్యాగులు, ఋషులు, యోగులు, మహానుభావులు, గురువులు, స్వామీజీలను అనుసరించాలి.
అప్పుడు మీకు మీరుగా ఈ భక్తి అనే సత్ సాంగత్యపు ప్రవాహంలోకి చేరి పోతారు. దీని వల్ల మీకు మీరు కొత్తగా కనపడతారు. మీలో ఏదో తెలియని శక్తి చేరిపోతుంది. అదే భక్తి. మీకు మీరుగా కొత్త వ్యక్తులుగా, పరిపూర్ణమైన భక్త బంధువులుగా మారి పోతారు. దీనిని సాధించడం ఏమంత కష్టమైన పని కాదు. భేషజాలకు తావివ్వ కుండా మీ అంతకు మీరే మార్గ నిర్దేశకులుగా మారిపోతారు. అన్నీ ఉన్నా, అందుబాటులో సంపద లెక్క లేనంతగా ఉన్నా ఇంకా మీలో ఏదో నిరాశ, అసంతృప్తి వెంటాడుతూనే ఉన్నది. జస్ట్ మీ కోసం మీరు టైం కేటాయించుకోండి చాలు.
అదే మీకు అంతులేని సంతోషాన్ని, సంపదను కలుగ చేస్తుంది. ఎంతగా పోగేసుకున్నా, ఎంత మంది నీకోసం ఉన్నారన్నదే నీకు ముఖ్యం. ఆత్మ సంతృప్హి అన్నది లేకపోతే ఎన్ని ఉన్నా దండగే. అందుకే ప్రతి రోజూ మీకోసం కనీసం ఓ పది నిమిషాలు కేటాయించుకోండి చాలు. మీలో అంతులేని తృప్తి చేరుతుంది. మీలో ఆధ్యాత్మిక జ్యోతి వెలుగుతుంది. ఇదే జగత్ గురు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామిజీ చెబుతున్నది. వీలైతే ఒక్కసారి స్వామి వారిని దర్శించుకోండి. ఆ ఆధ్యాత్మిక వెలుగులో ప్రయాణం చేయండి చాలు మీ జన్మ ధన్యమవుతుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి