ఫోర్బ్స్‌ టాప్‌10లో మనోడు


రిలయన్స్ గ్రూప్ కంపెనీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ మరోసారి చరిత్ర సృష్టించారు. అంతులేని సంపదతో రికార్డులను బ్రేక్ చేస్తున్నారు. ప్రముఖ బిజినెస్‌ మ్యాగజైన్‌ ‘ఫోర్బ్స్‌’ తాజాగా ప్రకటించిన ఈ ఏడాది ప్రపంచ కుబేరుల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ 9వ స్థానంలో నిలిచారు. ఆయన సంపద విలువ 60 బిలియన్‌ డాలర్లు అంటే దాదాపు 4.3 లక్షల కోట్ల రూపాయలుగా ఉందని రియల్‌ టైమ్‌ బిలియనీర్స్‌ లిస్ట్‌ పేరిట విడుదల చేసిన జాబితాలో ఫోర్బ్స్‌ పేర్కొంది.

తాజాగా ఆర్‌ఐఎల్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 10,01,555 కోట్లకు చేరి..ఈ స్థాయి మార్కెట్‌ క్యాప్‌ సాధించిన తొలి భారత కంపెనీగా నిలవటం తెలిసిందే. కంపెనీ షేరు ధర ఇంట్రాడేలో 1,580 చేరిన నేపథ్యంలో ప్రమోటర్‌ సంపద అమాంతం పెరిగి పోయింది. దీంతో గతేడాది 13వ స్థానంలో ఉన్న ముకేశ్‌ అంబానీ, ఈసారి ఏకంగా టాప్‌10లోకి చేరి ఈ స్థాయి సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు.

ఇక ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా మరోసారి అమెజాన్‌ ఫౌండర్, సీఈఓ జెఫ్‌ బెజోస్‌ నిలిచారు. ఆయన సంపద విలువ 113 బిలియన్‌ డాలర్లు అంటే దాదాపు 8 లక్షల కోట్లు. ఆ తరువాతి స్థానంలో 107.4 బిలియన్‌ డాలర్ల సంపదతో మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నిలిచారు. ఎంతైనా మనోడు గట్టోడు కదూ. 

కామెంట్‌లు