ప్రియాంక మరణం..సినీలోకం ఆగ్రహం
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ హత్యపై టాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో స్పందించారు. ఆమె హత్య తమను ఎంతగానో కలచివేసిందని పేర్కొన్నారు. అల్లరి నరేశ్, అల్లు శిరీశ్, సుధీర్‌బాబు, వివి వినాయక్, కీర్తి సురేశ్, మెహ్రీన్ పిర్జాదా, లావణ్య త్రిపాఠి, రాశిఖన్నా, స్మిత తదితరులు ట్విటర్ ద్వారా తమ ఆందోళన వ్యక్తం చేశారు. హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పరిస్థితులు రోజు రోజుకి దారుణంగా తయారవుతున్నాయని , ప్రియాంక రెడ్డి హత్య తెలియ గానే ఆ సమయంలో తనకు మాటలు రాలేదని హీరోయిన్ కీర్తి సురేశ్ పేర్కొన్నారు. తాను అత్యంత సురక్షిత నగరమని భావించే హైదరాబాద్‌లో ఇంత దారుణ ఘటన బాధ కలిగించిందన్నారు.
ఏ సమయంలో నైనా బయటికి వెళ్లిన మహిళలు సురక్షితంగా తిరిగి వచ్చే పరిస్థితులు దేశంలో ఎప్పుడొస్తాయని ప్రశ్నించారు. ప్రియాంకను అత్యంత కిరాతంగా హత్య చేసిన హంతకులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రియాంక మృతికి సంతాపం తెలిపారు. ఆమె కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు. తాను కర్మను నమ్ముతానని, అది ఎల్ల వేళలా పని చేస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. హంతకులను ఉరి తీయాలని హీరోయిన్ రాశిఖన్నా అన్నారు. ప్రియాంక హత్య గురించి తెలియ గానే గుండె పగిలినంత పనైందని తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మన సమాజం ఎటు పోతోందని ఆవేదనగా ప్రశ్నించారు.
ప్రియాంక హత్య పట్ల హీరోయిన్ లావణ్య త్రిపాఠి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక అమ్మాయిని ఇంత కిరాతంగా చంపుతారని ఊహించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రియాంక కుటుంబానికి న్యాయం జరగాలని ఆమె ట్వీట్ చేశారు. ప్రియాంక హత్య వార్త గురించి తెలియగానే షాక్‌కు గురయ్యానని మరో హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా పేర్కొన్నారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని వెంటనే చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేశారు. డాక్టర్ ప్రియాంకరెడ్డి తన చెల్లితో మాట్లాడిన చివరి ఫోన్‌కాల్ హృదయాన్ని మెలి పెట్టేలా ఉందని హీరోయిన్ దివ్యాంషా కౌశిక్ పేర్కొన్నారు. రాత్రి సమయాల్లో యువతులు చాలా అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మొద్దని సూచించారు.
ఈ దారుణాలకు ఎప్పుడు అడ్డుకట్ట పడుతుంది. ప్రాథమిక పాఠశాల విద్యాభ్యాసంలో భాగంగా ఆడపిల్లలకు ఆత్మ రక్షణ విద్యలు నేర్పించాలి. ఆడ పిల్లలతో ఎలా మెలగాలి, వారిని ఎలా కాపాడాలనే దాని గురించి బాలురకు శిక్షణ ఇవ్వాలి. ఇటువంటి చర్యలతోనే వచ్చే తరాన్ని కాపాడు కోవాలి. సారీ ప్రియాంక అంటూ ప్రముఖ సింగర్ స్మిత ట్వీట్ చేశారు. ప్రియాంక హత్యను ఖండించడానికి దారుణం, కిరాతం వంటి మాటలు కూడా సరిపోవని హీరో అల్లరి నరేశ్ పేర్కొన్నారు. దేశంలో ఆడపిల్లలను కాపాడు కోలేక పోతే మనకు భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు. ఆపద సమయంలో పోలీసుల సహాయం తీసుకోవాలని హీరో సుధీర్‌బాబు సూచించారు.
లైవ్ లొకేషన్ యాప్స్, అత్యవసర ఫోన్ కాల్ ఆప్షన్స్ తప్పనిసరిగా ఉండేట్టు చూసుకోవాలన్నారు. ప్రియాంక ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. హంతకులను అరెస్ట్ చేసి సాధ్యమైనంత త్వరగా శిక్షించాలని దర్శకుడు వివి వినాయక్ డిమాండ్ చేశారు. ప్రియాంక హత్య గురించి తెలియగానే తనకు బాధ, కోపం, నిస్సహాయత వంటి భావోద్వేగాలు కలిగాయని హీరో అల్లు శిరీష్ పేర్కొన్నారు. మన అందరి ఆగ్రహం ప్రియాంకరెడ్డికి న్యాయం జరగడానికి తోడ్పడాలన్న ఆకాంక్షను వెలిబుచ్చారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి