రండి..మాట్లాడుకుందాం
నిన్నటి దాకా తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన 48 వేల మంది కార్మికులు రోడ్డెక్కారు. 52 రోజులుగా ఆందోళనలు చేపట్టారు. హైకోర్టుకు వెళ్లారు. ప్రభుత్వాన్ని నిలదీశారు. అన్ని వర్గాల ప్రజలతో పాటు ప్రతిపక్షాలు, విద్యార్ధి, యువజన సంఘాలు, మేధావులు, కవులు, కళాకారులు పూర్తి మద్దతు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కార్మికులు చేసిన ఈ పోరాటం చిరస్థాయిగా నిలిచి పోయింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ రాజేంద్రసింగ్ చౌహన్ కార్మికుల వైపు నిలబడ్డారు. ఓ రకంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు కార్మికులు తిరిగి విధుల్లోకి తీసుకునేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసు కోవాలని సూచించారు.
మరో వైపు విపక్షాలు, ప్రజాస్వామిక వాదులు, కేంద్ర మంత్రి గడ్కరీ సైతం వెంటనే విధుల్లోకి తీసు కోవాలని కోరారు. తెలంగాణ సమాజం మొత్తం ఆర్టీసీ కార్మికుల వైపు నిలబడింది. దీంతో సీఎం కేసీఆర్ ఓ మెట్టు దిగారు. ప్రభుత్వం సరైన సమయంలో స్పందించి చర్యలు తీసుకుని ఉన్నట్లయితే కార్మికులు చనిపోయి ఉండేవారు కాదన్న అభిప్రాయం వ్యక్త మైంది. ఇదే సమయంలో సీఎం లేటైనా లేటెస్ట్ గా రెస్పాండ్ అయ్యారు. ఎలాంటి షరతులు పెట్టకుండానే విధుల్లోకి తీసుకునేలా చర్యలు చేపట్టారు. అంతే కాకుండా యూనియన్ల దుందుడుకు స్వభావం వల్లనే కార్మికులు ఆందోళన బాట పడ్డారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే 100 కోట్లు కూడా విడుదలయ్యాయి. మరో గుడ్ డిసిషన్ తీసుకున్నారు ఆయన.
ఆయా ఆర్టీసీ డిపోలలో పైస్థాయి అధికారులు, డిపో మేనేజర్లు వేధింపుల నుండి కాపాడేందుకు గాను ఎంప్లాయిస్ సంక్షేమం కోసం ఓ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. తానే స్వయంగా కార్మికులతో మాట్లాడతానని చెప్పారు. ఆయన అన్నమాటకు కట్టుబడి ఉన్నారు. డిసెంబర్ 1న ఆర్టీసీ కార్మికులతో భేటీ అవుతానని కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలోని మొత్తం 97 డిపోలకు చెందిన ఆర్టీసీ కార్మికులతో ప్రగతి భవన్ లో భేటీ కావాలని నిర్ణయించారు . ప్రతీ డిపో నుంచి ఐదుగురు కార్మికులను ఈ భేటీకి ఆహ్వానించాలని, వారికి తగు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఎండి సునీల్ శర్మను ఆదేశించారు కేసీఆర్.
తనతో భేటీ కానున్న ఐదుగురు కార్మికుల్లో ఖచ్చితంగా ఇద్దరు మహిళా ఉద్యోగులుం ఉండాలన్నారు. అన్ని వర్గాలకు చెందిన కార్మికుల భాగస్వామ్యం ఉండేలా చూడాలని సిఎం కోరారు.12 గంటల వరకు కార్మికులను ప్రగతి భవన్ తీసుకు రావాలని ఆదేశించారు. భోజనం చేసిన తర్వాత కార్మికులతో సుదీర్ఘంగా చర్చించనున్నారు ముఖ్యమంత్రి. రండి మాట్లాడుకుందామని తెలంగాణ బాస్ చెప్పడంతో కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో కలిసే భాగ్యం దొరకడంతో ఆ అదృష్టం ఎవ్వరికీ దక్కుతుందోననే ఉత్కంఠ కార్మికుల్లో నెలకొంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి