ఆర్టీసీ సమ్మెకు అంతమే లేదా

తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కారించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 42 రోజులకు చేరుకుంది. ఇప్పటి దాకా పలువురు కండక్టర్లు, డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ప్రతిపక్ష పార్టీలతో సహా విద్యార్ధి సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులు, కళాకారులు, ప్రజాస్వామిక వాదులు, న్యాయవాదులు, వ్యాపారులు, సకల జనులు కార్మికుల ఆందోళనకు మద్దతు ప్రకటించారు. హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు పెద్ద ఎత్తున దాఖలయ్యాయి. ఈ మేరకు ధర్మాసనం ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని తప్పు పట్టింది. అంతే కాకుండా ఆర్టీసీ సంస్థకు చెందిన ఉన్నతాధికారుల బాధ్యతా రాహిత్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఒకానొక సమయంలో కార్మికుల పట్ల ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలపై మండి పడింది. కోర్టుకు తప్పుడు అఫిడవిట్లు సమర్పించిన అధికారులపై రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ఫైర్ అయ్యారు. ఇదే సమయంలో రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని, ఇందు కోసం తమ అభిప్రాయాన్ని చెప్పాలని అడ్వొకేట్ జనరల్ ను ఆదేశించింది. దీనికి ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె పూర్తిగా న్యాయమైనదేనని స్పష్టం చేసింది. వెంటనే సమ్మెను విరమింప చేసేలా ప్రభుత్వం చర్యలు తీసు కోవాలని కోర్టు సూచించింది. కార్మికులు మెట్టు వీడాలని, ప్రభుత్వం గట్టు దిగాలని ఆదేశించింది. అయినా సర్కార్ నుంచి సరైన స్పందన లేకుండా పోయింది.

ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలన్న ప్రతిపాదనను తాత్కాలికంగా విరమించుకుంటున్నామని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి స్పష్టం చేశారు. అయినా ప్రభుత్వం, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ ఒప్పుకోలేదు. అంతే కాకుండా తాజాగా హైకోర్టులో మరో అఫిడవిట్ దాఖలు చేశారు ఎండీ. వెంటనే కార్మికులు చేస్తున్న సమ్మె చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని హైకోర్టుకు విన్నవించారు. సమ్మె ఇల్లీగల్, పాల్గొన్న కార్మికులూ శిక్షకు అర్హులేనని తీర్పు ఇవ్వాలని కోరారు. యూనియన్లు బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని, ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్ర పన్నుతున్నారని అఫిడవిట్ లో పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిస్థితి అదుపు తప్పిందని, సంస్థకు కోలుకోలేని రీతిలో నష్టాలు వచ్చాయని తెలిపారు. ఇదిలా ఉండగా కేసీఆర్ పై అశ్వత్థామ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రాసిస్తే ఎండీ సైన్ చేశారని ఆరోపించారు.

కామెంట్‌లు