గూగుల్ పై వాల్‌స్ట్రీట్ జర్నల్ ఫైర్
ప్రపంచాన్ని శాసిస్తున్న గూగుల్ పై ఇప్పటికే పలు కంపెనీలు గుర్రుగా ఉన్నాయి. తమ డేటాకు భద్రత లేకుండా పోతోందని, తమ అనుమతి లేకుండానే మొత్తం సమాచారాన్ని వెలుగులోకి తీసుకు వస్తోందంటూ తీవ్ర ఆరోపణలు చేశాయి ఇప్పటికే. దీనిని గూగుల్ తేలిగ్గా తీసుకుంటోంది. ప్రతి ఒక్క కంపెనీ అభ్యర్థన మేరకే తాము డేటాను జాగ్రత్తగా ఉండేలా చూస్తామని, ఇందు కోసం లక్షలాది మంది సాంకేతిక నిపుణులు నిమగ్నమై ఉంటారని సీఇఓ సుందర్ పిచ్చాయ్ స్పష్టం చేశారు. ఇందు కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది గూగుల్. కొన్ని వెబ్ సైట్స్ అసాంఘిక కార్య కలాపాలకు పాల్పడుతున్నాయి. వీటిని ముందే పసిగట్టేలా చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఆయా దేశాలలో కొలువుతీరిన ప్రభుత్వాల నియమ నిబంధనలకు లోబడే గూగుల్ పని చేస్తోంది.
ఇప్పటికే కొన్ని కేసులు నడుస్తున్నాయి కూడా. అయితే సదరు కంపెనీ మాత్రం తమ పరిమితులకు లోబడే పని చేసుకుంటూ పోతామని, వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించే రీతిలో వ్యవహారాలు ఉండబోవని స్పష్టం చేసింది. కాగా గూగుల్ కొన్ని వెబ్‌సైట్లను కావాలనే బ్లాక్ లిస్టులో పెడు తోందని, సెర్చ్ లిస్టులో కనబడకుండా చేస్తోందని 2000 సంవత్సరం నుంచే సెర్చింగ్ దిగ్గజం ఇలాంటి పని చేస్తోందని అమెరికాకు చెందిన వాల్‌స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. గూగుల్ న్యూస్ సెర్చింగ్‌లో కన్జర్వేటివ్ పబ్లికేషన్స్ కన బడకుండా అల్గారిదమ్ సెట్ చేసిందని, రాజకీయంగా పక్షపాతం వహిస్తోందని ఆరోపించింది. యునైటెడ్ వెస్ట్, ది గేట్‌వే పండిత్ లాంటి రైట్ వింగ్ వెబ్ సైట్లు మిగతా సైట్లలానే సెర్చ్ ఇంజిన్‌లో లిస్టయినా గూగుల్ న్యూస్‌లో కనబడటం లేదని పేర్కొంది. పెద్ద పెద్ద బిజినెస్ మెన్‌ల కంపెనీలనే సంస్థ ప్రమోట్ చేస్తోందని, వాళ్లకే పనికొచ్చేలా, వాళ్ల వెబ్ సైట్లు బాగా కనబడేలా అల్గారిదమ్‌ను మారుస్తోందని ఆరోపించింది.
చిన్న బిజినెస్‌లకు ఎలాంటి సాయం చేయడం లేదని వివరించింది. ‘ఈబే’ కంపెనీకి ఇలానే సహకరిస్తోందని చెప్పింది. అమెజాన్, ఫేస్‌బుక్ లాంటి వెబ్‌సైట్లనూ గూగుల్ బూస్ట్ చేస్తోందని పేర్కొంది. తన ఆరోపణలు కరెక్టని చెప్పేందుకు డక్‌డక్‌గో, గూగుల్ సెర్చ్ ఇంజిన్లలో ఒకే సారి సెర్చ్ చేసి వాటిని ఫొటో తీసి పోస్టు చేసింది. వాల్‌స్ట్రీట్ జర్నల్ రిపోర్టుపై గూగుల్ స్పందించింది. తాము ట్రాన్స్‌పరెంట్‌గా పని చేస్తామని, పని గట్టుకొని ఎవరినీ ప్రమోట్ చేయమని స్పష్టం చేసింది. ఆ రిపోర్టులో అన్నీ పాతవి, పనికిరాని విషయాలే ఉన్నాయని చెప్పింది. గూగుల్ పాలసీల ప్రకారం పబ్లిషర్ విషయాలు గానీ, ఓనర్‌షిప్ గురించి గానీ చెప్పని సైట్లనే బ్లాక్ చేస్తామని వివరించింది. ఇదంతా చట్టబద్దంగా ఉంటుందని చెప్పింది. గూగుల్ న్యూస్ పాలసీని పాటించని వెబ్‌సైట్లు కచ్చితంగా న్యూస్ సెర్చ్ లో కనిపించవని వెల్లడించింది. మొత్తం మీద ఇప్పట్లో గూగుల్ దిగ్గజ కంపెనీ దరిదాపుల్లోకి వచ్చే కంపెనీ కనిపించడం లేదు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి