సమ్మె విరమిస్తేనే సై..లేకుంటే నై..!
గత కొన్ని రోజులుగా ఆర్టీసీ సమ్మె చేస్తున్నా ఎందుకు స్పందించడం లేదని, తక్షణమే చర్చలు జరుపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అంతే కాకుండా కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇంతవరకు వేచి చూసే ధోరణి అవలంభిస్తున్న ప్రభుత్వం సమ్మె తీవ్రతను గుర్తించడం లేదు. అంతే కాకుండా ఎట్టి పరిస్థితుల్లో చర్చలు జరిపే ప్రసక్తి లేదంటూ స్పష్టం చేశారు. మరో వైపు కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారంటూ సీఎం కేసీఆర్ అన్నారు. దీంతో కార్మికులు ఆందోళనకు గురై ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్టీసీ జేఏసీ నేతలకు సకల జనులతో పాటు అన్ని పార్టీలు, ప్రజా, విద్యార్ధి సంఘాలు మద్దతు తెలిపాయి. బీసీ కార్మికులు వేధింపులకు లోనవుతున్నారని ఫిర్యాదులు అందాయని, తక్షణమే పూర్తి వివరాలతో ఈనెల 25 లోపు బీసీ కమిషన్ ఎదుట ఆర్టీసీ ఎండీ హాజరు కావాలని కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి నోటీసులు జారీ చేశారు.
మరో వైపు కోర్టు సీరియస్ అయ్యింది. ఇంకో వైపు జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఆర్టీసీ నేతలు ఫిర్యాదు చేశారు. అన్ని వైపుల నుండి వత్తిళ్లు పెరగడం తో సర్కార్ పునరాలోచనలో పడ్డది. అయితే సమ్మె, ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సీఎం ఉన్నతాధికారులు, మంత్రితో సమావేశం నిర్వహించారు. కాగా కార్మికులు సమ్మె విరమించి వస్తేనే చర్చలకు పిలవాలని అనుకుంటున్నట్టు సమాచారం. ఇదే సమయంలో గవర్నర్ కూడా సమ్మెపై ఆరా తీయడం కూడా సంచలనం కలిగించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో..మూడు రోజుల్లో ఆర్టీసీ కార్మికులతో చర్చల ప్రక్రియ పూర్తి చేయాలంటూ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో కార్మికులతో సంప్రదింపులకు ఆర్టీసీ ఎండీ కసరత్తు చేస్తున్నారు.
ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద ఓ సారి చర్చ జరిగింది. హైకోర్టు మాత్రం కార్మికులతో చర్చించాల్సిందేనని ఆర్టీసీ ఎండీని ఆదేశించింది. తదుపరి వాయిదా ఈనెల 28న ఉన్నందున, అప్పటి వరకు చర్చల సారాంశాన్ని కోర్టుకు విన్నవించాల్సి ఉంది. హైకోర్టు ఎండీని నేరుగా ఆదేశించినందున, చర్చలు చేపట్టకుంటే కోర్టు ధిక్కరణ కిందకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు బంద్‌కు వివిధ వర్గాల మద్దతు లభించడంతో ఆర్టీసీ కార్మిక సంఘాలు తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి. కానీ దీనిని అంగీకరించవద్దని ప్రభుత్వం భావిస్తోంది. సమ్మె నేపథ్యంలో పొడిగించిన సెలవులు కూడా పూర్తి అవుతున్నాయి. ఏం జరుగ బోతుందనేది బాల్ సీయం చేతిలో ఉంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి