సర్కార్ దిగొచ్చే దాకా సమరమే


ఆర్టీసీ కార్మికులతో బేషరతుగా చర్చలు జరపాల్సిందేనని రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసినా ప్రభుత్వం వైపు నుంచి స్పందన రాలేదు. దీంతో ఆర్టీసీ జేఏసీ విపక్షాలు, ప్రజా, విద్యార్ధి సంఘాలతో భేటీ అయ్యింది. సర్కారు దిగి వచ్చే దాకా సమరానికి సిద్ధం కావాల్సిందేనని కీలక నిర్ణయం తీసుకున్నది. బంద్ సక్సెస్ అయ్యిందని, ఇక ప్రభుత్వంతో తాడో పేడో తేల్చు కోవాలంటే అందరి సహకారం కోరడంతో పాటు మరింత ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లాలని తీర్మానం చేశారు.ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీల నేతలతో ప్రత్యేకంగా ఆర్టీసీ జేఏసీ సమావేశమైంది. సమ్మెపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరుతూ మరోసారి గవర్నర్ ను కలవనున్నట్లు జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి వెల్లడించారు.

16వ రోజుకు చేరుకున్న ఆర్టీసీ సమ్మెపై ఈరోజు వరకు సర్కార్ సానుకూలంగా స్పందించిన పాపాన పోలేదన్నారు. ఆర్టీసీ ఆస్తులను కాపాడు కోవాలన్నదే తమ లక్ష్యమని అశ్వత్థామరెడ్డి తెలిపారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మస్థైర్యం కోల్పోరాదని, విజయం సాధించే వరకు పోరాడుదామని అన్నారు. కార్మికుల ప్రయోజనాలు కాపాడటమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. 21న అన్ని ఆర్టీసీ డిపోల ముందు కార్మికులు తమ కుటుంబ సభ్యులతో కలిసి బైఠాయించనున్నారు. 22న మా పొట్టకొట్టొద్దని తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను కార్మికులు విజ్ఞప్తి చేయనున్నారు.

23న ప్రజా ప్రతినిధులను కలిసి సమ్మెకు మద్దతు తెలపాలని,  భాగస్వామ్యం కావాలని కోరనున్నారు. 24న మహిళా కండక్టర్ల దీక్ష, 25న హైవేలు, రహదారులపై రాస్తారోకోలు చేపట్టనున్నారు. 26న ప్రభుత్వం మనసు మారాలని ఆర్టీసీ కార్మికుల పిల్లలతో దీక్ష చేప్టనున్నారు. 27న పండగ సందర్భంగా జీతాలు లేక పోవడం వల్ల నిరసన, 28న సమ్మెపై హైకోర్టు విచారణ సందర్భంగా విరామం. 30న 5  లక్షల మందితో సకల జనుల సమర భేరి నిర్వహిస్తామని, ఇందుకు సంబంధించిన వేదికను త్వరలో ప్రకటిస్తామని అశ్వత్థామ రెడ్డి చెప్పారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!