కార్మికుల కోసం జనసేనాని
జనసేన పార్టీ అధినేత, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ ..జనమే జెండా సమస్యలే ఎజెండా దిశగా కొనసాగుతున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో నెలకొన్న ఇస్యూస్ పై ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ బాధ్యులు హాజరయ్యారు. ఈ మీటింగ్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ కార్యాచరణ, ప్రజా సమస్యలపై చర్చించారు. ఆంధ్ర ప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం అయ్యేలా చూడాలని పార్టీ శ్రేణులను పవన్ ఆదేశించారు.
పార్టీ శ్రేణులలో స్థైర్యాన్ని పెంపొందించి, యువ నాయకత్వం బలోపేతానికి పార్టీ కార్యాచరణ చేయాలని కమిటీ సభ్యులకు పవన్ సూచించారు. మరీ ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పని తీరు, హామీలు, పథకాల అమలులో వైఫల్యాలు, విద్యుత్ సంక్షోభం, సాగుదారుల సమస్యలు, జనసేన నేతలు, శ్రేణులపై అధికార పక్షం చేస్తున్న దాడులపై చర్చించారు. ఇదిలా ఉంటే.. ఏపీలో భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా విశాఖలో నవంబర్ 3 న భారీ ర్యాలీ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ ప్రదర్శనలో తాను కూడా పాల్గొంటానని జనసేనాని చెప్పారు. పార్టీ శ్రేణులంతా భవన నిర్మాణ కార్మికులకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. కాగా తెలంగాణాలో నెలకొన్న ప్రధాన సమస్యలపై కూడా చర్చించారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం కొన్ని రోజులుగా చేస్తున్న సమ్మెకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆర్టీసీ జేఏసీ చేపట్టబోయే అన్ని నిరసనలు, ఆందోళనలు, కార్యక్రమాలలో జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలని ఆదేశించారు పవన్ కళ్యాణ్.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి