సమస్తం కార్మికుల కోసం
సకల తెలంగాణ సమాజం ఒక్కటి కాబోతున్నది. మీ అందరి తోడ్పాటు, సహకారం వల్లనే మేమిచ్చిన బంద్ పిలుపు సక్సెస్ అయ్యింది. ఇదే స్పూర్తితో ప్రభుత్వం దిగి వచ్చే దాకా తమ ఆందోళన కొనసాగుతూనే ఉంటుంది. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, సకల జనులు మా వెంట ముందుండి నడిచారు. మీకందరికీ కృతజ్ఞతలు. మీ ఋణం మేం తీర్చుకోలేం. మేం న్యాయబద్ధమైన డిమాండ్లను మాత్రమే అడుగుతున్నాం. కానీ ముఖ్యమంత్రి మాత్రం తన అహాన్ని వీడడం లేదు. అందుకే గత్యంతరం లేని పరిస్థితుల్లో సమ్మెకు దిగాల్సి వచ్చింది. ఇందుకు మా కార్మికులందరి తరపున క్షమాపణలు చెబుతున్నామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వతమ రెడ్డి చెప్పారు. అన్ని పార్టీలు, సంఘాలు, మేధావులు, మహిళా సంఘాలతో జేఏసీ సమావేశమైంది.
జేఏసీ చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు అన్ని పార్టీలు, సంఘాలు ప్రకటించాయి. ఈ మేరకు కార్యాచరణను ప్రకటించింది జేఏసీ. అంతే కాకుండా కార్మికులంతా దీపావళి పండుగను జరపరాదని నిర్ణయం తీసుకున్నామని అశ్వత్తమ్మ రెడ్డి చెప్పారు. కాగా బంద్ సక్సెస్ కావడంతో సమ్మె మలి దశ కార్యాచరణ పటిష్టంగా ఉండేలా చూడాలని జేఏసీ తీర్మానించింది. 4 లక్షల మందితో సకల జనుల సమర భేరీ పేరుతో హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో 3 లక్షల మంది ఆర్టీసీ కార్మికుల కుటుంబ సభ్యులు, మరో లక్ష మంది సాధారణ ప్రజలు హాజరయ్యేలా రాజకీయ పార్టీలతో కలసి జన సమీకరణ జరపాలని నిశ్చయించారు. ఈలోగా ఇతర నిరసన కార్యక్రమాలు కొనసాగించనున్నారు. కోర్టు తీర్పును కూడా ప్రభుత్వం గౌరవించక పోవడం దారుణం. ముఖ్యమంత్రి నియంతలా వ్యవహరిస్తున్నారు. పోలీసులు దమనకాండను కొనసాగిస్తున్నారని నేతలు అభిప్రాయం పడ్డారు.
కార్మికులు చేపట్టే అన్ని నిరసన కార్యక్రమాల్లో మా నేతలు పాల్గొంటారు. ప్రజాప్రతినిధుల ములాఖత్‌లో మేమూ పాల్గొంటాం. వారికి మా సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకట్‌రెడ్డి, ఎస్.వెంకటేశ్వరరావులు. ఆర్టీసీ పరిరక్షణకు నడుం బిగించాలని కోర్టు చెప్పినా ప్రభుత్వం వినక పోవడం విడ్డూరం. ఆర్టీసీ ఆస్తులు, అప్పులపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి. కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ఉద్యమానికి పౌరసమాజం మద్దతు ఉందన్నారు టీడీపీ ప్రెసిడెంట్ రమణ. కోర్టు ఆదేశాన్ని గౌరవించి కార్మికులను ప్రభుత్వం చర్చలకు పిలవాలి. ఆర్టీసీ ఆస్తులను కాపాడు కోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఆర్టీసీ జేఏసీకి మా సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు కోదండరాం.
వేల పుస్తకాలు చదివానని చెప్పుకునే ముఖ్యమంత్రి నేర్చుకున్నది ఇదేనా? ప్రజలు శక్తిమంతులు, వారి ఆగ్రహాన్ని తట్టు కోవడం కష్టమంటూ హైకోర్టు వ్యాఖ్యానించినా కేసీఆర్ పెడచెవిన పెట్టడం వల్ల ఆయనకే నష్టం కలుగుతుంది అన్నారు డాక్టర్ చెరుకు సుధాకర్. న్యాయ వ్యవస్థపైనా ప్రభుత్వానికి గౌరవం లేకుంటే ఎలా? ఆర్టీసీ సమస్యను పరిష్కరించాలని హైకోర్టు ఆదేశించినా చర్చలకు ఎందుకు పిలవట్లేదు. లోటు బడ్జెట్‌తో ఉన్న ఏపీని అక్కడి ముఖ్యమంత్రి అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తుంటే మిగుల బడ్జెట్ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తోందని ప్రశ్నించారు మందకృష్ణ మాదిగ.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి