రవిప్రకాశ్ ఎందుకిలా..?
తెలుగు మీడియా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను ఆపాదించుకుని..ఓ బ్రాండ్‌గా ఎదిగిన రవి ప్రకాశ్ జర్నలిస్టుగా సుపరిచితులే. ప్రింట్ అనే సరికల్లా రామోజీరావు ఎలా గుర్తుండి పోతారో..మీడియా అనే సరికల్లా రవి అలాగే గుర్తుండి పోతారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బషీర్ బాగ్ సంఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. రైతులపై కాల్పులు..దానిని ప్రజెంటేషన్ చేసిన తీరు తెలుగువారిని ఆశ్చర్య పోయేలా చేసింది. ఆ తర్వాత ఓ మిస్సైల్‌లా దూసుకు వచ్చాడు. అంతకు ముందు సుప్రభాతంలో పనిచేసినట్టు గుర్తు. వెలిజాల శ్రీనివాస్ రెడ్డి, రవిప్రకాశ్ ఇద్దరూ ఒక టేబుల్ దగ్గర కూర్చుంటే..నేను శైలేష్ రెడ్డి మరో టేబుల్ వైపు కూర్చున్నాం. ఆ సమయంలో టీవీ9 ఛానల్ గురించి చర్చ జరుగుతోంది. తెలుగు రాష్ట్రంలో అదో సంచలనం. 24 గంటల న్యూస్ ఛానల్‌ను ఎవరు చూస్తారులే అనుకున్నారు.
ఇక్కడి ప్రజలతో పాటు పాత్రికేయులు, మీడియా ప్రముఖులు, బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టులు, ఫ్రీలాన్సర్స్ కూడా. కానీ అక్కడే తానేమిటో రుజువు చేసుకున్నాడు. వ్యక్తిగతంగా విభేదించినా ..జర్నలిస్టుగా రవి సాధించిన సక్సెస్ చిన్నది కాదు..ఒక రకంగా వ్యక్తి నుంచి వ్యవస్థగా మార్చాడు టివి9 ఛానల్‌ను. ఇవాళ పత్రికలు, టీవీ ఛానల్స్ నడపాలంటే చాలా ఓపిక వుండాలి. అంతకంటే దానిని భరించే శక్తి కావాలి. అది డబ్బున్న వాళ్లయితేనే మోయగలరు. ఇవ్వన్నీ తెల్ల ఏనుగుల్లా తయారయ్యాయి. ఎందుకనో రవి ప్రకాశ్ తీసుకున్న స్టాండ్ ఒక రకంగా తెలంగాణలో పూర్తి వ్యతిరేకత ఏర్పడింది. ఆ మధ్య కేసీఆర్ సర్కార్‌పై ..అప్పట్లో ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు ప్రమాణ స్వీకారం చేయడం రాదని, కొంచెం తడబాటు పడితే దానిని పదే పదే టెలికాస్ట్ చేయడంపై గులాబీ బాస్ కేసీఆర్ సీరియస్ అయ్యారు. ఆ విషయాన్ని ప్రెస్ మీట్‌లోను..అసెంబ్లీలోను ప్రస్తావించారు. ఆ రెండు ఛానల్స్ కు ఎంత ధైర్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆ ఛానళ్లకు నోటీసులు ఇప్పించారు. కొంత కాలం పాటు కేబుల్ లో నే రాకుండా చేశాడు.
ఒకప్పుడు రవి ప్రకాశ్ అంటే కొందరు నేతలు జడుసుకున్నారు. మరికొందరు ఆయనతో పోటీ పడేందుకు ఇష్టపడ్డారు. ఇంకొందరు రాజీ పడ్డారు. రవి ప్రకాశ్ తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన ప్రోగ్రామ్స్ ఒక రకంగా జర్నలిజంలోకి రావాలనుకునే వారికి పాఠంగా ఉపయోగ పడతాయి. కానీ వ్యక్తిగతం వరకు వస్తే మాత్రం దేనిని హర్షించలేనంతగా ఆయన ఎదిగి పోయారు. ఎంతో మందిని, ఎందరినో వెలుగులోకి తీసుకు వచ్చిన టీవీ9 రవిప్రకాశ్ ఎందుకిలా చేశాడన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. నిత్యం సామాజిక ట్యాగ్ లైన్లతో జనాన్ని చైతన్యవంతం చేసే పనిలో ఉన్న ఆ ఛానల్..ఎన్నో ఏళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న క్రెడిబిలిటిని కోల్పోయింది. ఏ సంస్థనైతే తనదిగా భావించి డెవలప్ చేశాడో..అదే సంస్థ నుంచి వెళ్లిపోవడం బాధాకరమే. పలు భాషల్లో టీవీ9 ఇపుడు టాప్ టెన్‌లో ఒకటిగా కొనసాగుతున్నాయి. కంటెంట్ విషయంలో, ప్రజెంటేషన్ ఇవ్వడంలో, ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ టెలికాస్ట్ చేయడంలో అన్ని ఛానల్స్ కంటే ముందంజలో ఉంటోంది. దీనిని కాదనలేం ఎవ్వరూ కూడా.
తరాలకు సరిపడా కావల్సినంత డబ్బులు ఉన్నాయి. లెక్కలేనంత బ్రాండ్ నేం ఉండనే ఉన్నది. కానీ తనకు ఎదురే లేదంటూ ముందుకు సాగిన రవి ప్రకాష్‌కు ఇవాళ కొత్త యాజమాన్యం చుక్కలు చూపించింది. ఏకంగా తెలంగాణ సైబర్ క్రైం లో కేసు నమోదయ్యేలా చేసింది. చట్టానికి ఎవరూ అతీతులు కారు. చివరకు న్యాయస్థానమైనా..లేక ఫోర్త్ ఎస్టేట్‌గా భావిస్తున్న మీడియా అయినా. చాలా మంది ప్రతిభ కలిగిన వాళ్లు టీవీ 9లో పనిచేశారు. తమ శక్తిని ధార పోశారు. దానిని నెంబర్ వన్‌గా నిలబెట్టారు. తమ కుటుంబంలో ఒక దానిగా భావించారు. వార్త చదవాలంటే ఈనాడు..చూడాలంటే టీవీ9 అన్నంతగా ఎదిగాయి ఈ రెండూ. ఎన్ని ఛానల్స్ వచ్చినా..ఎన్ని పత్రికలు కొత్తగా ప్రారంభమైనా ..ప్రచురణ..ప్రసార మాధ్యమాల్లో ఈ రెండింటిని చూసి నేర్చు కోవాల్సిందే. అరుణ్ సాగర్ అనారోగ్యంతో చనిపోయాడు. ఇవాళ మన మధ్య లేరు. అద్భుతంగా రాసే టెక్నిక్ ఆయన స్వంతం. ఎంతో కాలం సేవలందించిన అరుణ్ టీవీ9ను వీడాడు. మంచికో చెడుకో లేక ఛానల్ నడిపేందుకో కానీ..అద్భుతమైన టీంను ఏర్పాటు చేశాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు.
ఉమ్మడి స్టాండే తీసుకున్నాడు..సిఇఓగా రవిప్రకాశ్. ఏరోజూ తెలంగాణ ఉద్యమం పట్ల ఆయన సానుకూలత ప్రదర్శించలేదు. ఓ వైపు శైలేష్ రెడ్డి సారథ్యంలోని జీ 24 గంటలు న్యూస్ ఛానల్ మొత్తం తెలంగాణ పోరాటానికి మద్ధతు పలికింది. ఇవాళ టీ శాట్ ఛానల్‌కు సిఇఓగా ఉన్నారు. శైలేష్ రెడ్డి, రవి ప్రకాశ్, దేవులపల్లి అమర్, ఏబికే ప్రసాద్, కొండుభట్ల శ్రీనివాస్, వాసువదేవ దీక్షితులు, సతీష్ చందర్, అల్లం నారాయణ, అరుణ్ సాగర్‌తో పాటు చాలా మంది వెలుగులోకి వచ్చారు. సిఇఓలు, ఎడిటర్లుగా ఉన్నారు. ఎవరి స్టాండ్ వారిదే. మరో వైపు జాతీయ స్థాయి న్యూస్ ఛానళ్లు , పత్రికలు తమ స్టాండ్‌ను మార్చుకున్నాయి. కానీ రవిప్రకాశ్ తన ధోరణిని మార్చుకోలేదు. ఎన్ కౌంటర్ ప్రోగ్రాంతో ఎందరినో వెలుగులోకి తీసుకు వచ్చిన ఈ బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్ట్ ..ఇపుడు తానే సమాజం ముందు దోషిగా నిలబడటం బాధాకరం. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండగలిగితేనే ఏదైనా సాధ్యమన్న సత్యాన్ని గుర్తిస్తే మేలు. టీవీ9 సంస్థలో తనకు షేర్ వుండవచ్చు ..కానీ ఎంతో కాలం పాటు తనకంటూ ఓ బ్రాండ్ ను ఏర్పాటు చేసుకున్న రవి ప్రకాష్ పట్ల సామాజిక మాధ్యమాల్లో సపోర్ట్ దొరకక పోవడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కాలం విచిత్రమైనది..అది ఎంత వారినైనా సరే..పర్వతం నుంచి పాతాళానికి తొక్కేస్తుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి