డిడిఎస్ మహిళా రైతులకు అరుదైన పురస్కారం
తెలంగాణకు చెందిన మహిళా రైతులు తమ శక్తి సామర్థ్యాలు ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పారు. భూమిని నమ్ముకుంటే నష్టం వుండదని, పర్యావరణం కోసం పాటు పడాలని దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీకి చెందిన స్వయం సహాయక మహిళా రైతులు పిలుపునిస్తున్నారు. ఎలాంటి ఎరువులు, మందులు లేకుండానే ప్రకృతి వ్యవసాయంతో సాగు చేస్తున్నారు. మనం మరిచి పోయిన పాత కాలం నాటి గింజలన్నీ ఇక్కడ లభిస్తాయి. తాజాగా యునైటెడ్ నేషన్స్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం ( యుఎన్‌డిపి) అంతర్జాతీయ సంస్థ డిడీఎస్ కు చెందిన మహిళా రైతులు మైసనగారి రత్నమ్మ, బ్యాగరి తుల్జమ్మ, నాగ్వార్ సునందమ్మ, ఎర్రోళ్ల కనకమ్మ, అంజమ్మ, అనసూయలకు ప్రతిష్టాత్మకమైన ఈక్వెటార్ ప్రైజ్‌ను 2019 సంవత్సరానికి ప్రకటించింది.
ఇది గత కొన్నేళ్లుగా సతీష్ నేతృత్వంలో నిర్వహిస్తున్న డీడీఎస్ సంస్థకు దక్కిన గౌరవంగా భావించాలి. ఆయన ఎన్నో ఏళ్లుగా దీనినే అంటిపెట్టుకుని వున్నారు. వ్యవసాయం దండగ కాదని పండగని నిరూపించారు. వాస్తవానికి మనం ఎక్కడికి వెళ్లినా నీళ్లుండవు. ఒకవేళ వుంటే అదే వరి అవే జొన్నలు లేదంటే సాగుకు డబ్బులుండవు. ఆత్మహత్యలు, కన్నీళ్లే. పంట దిగుబడి రాదు. పోనీ వచ్చినా..మార్కెట్‌లో గిట్టుబాటు ధర లభించదు. వీటన్నింటిని గుర్తించిన డీడీఎస్ ముందు పంటలు పండించడంలో మార్పులు రావాలని రైతులను చైతన్యవంతం చేశారు. వీరిలో చైతన్యం రావాలన్నా..లేదా సంస్థను నమ్మాలన్నా ముందు మహిళలను ఒకే చోటుకు చేర్చాలి.
అదే సంఘం. ఒక్కరితో కాని పని పదుగురితో అవుతుంది. ఇక్కడే వర్కవుట్ అయింది. పురుగు మందులు లేని వ్యవసాయానికి ప్రాణం పోసుకుంది. ఏ విశ్వవిద్యాలయం చేయలేని పనిని డీడీఎస్ చేస్తోంది. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడం, వారిని కార్యోన్ముఖులుగా చేయడం ఇలా ప్రతి పనిని తన భుజాన వేసుకున్నారు సతీష్. కొన్నేళ్లుగా ప్రకృతి వ్యవసాయంతో మమేకయ్యారు ఇక్కడి జనం .నేచురల్ ఫార్మింగ్ అనేది ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ప్రకృతి సేద్యంతోనే అన్ని పంటలు , కూరగాయలు పండిస్తున్నారు రైతులు. మహిళా రైతులు కూడా. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాన్ని ప్రకటించింది యుఎన్‌డిపి.
నేసనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ ( మేనేజ్ ) సంస్థ డైరెక్టర్ జనరల్ వి. ఉషారాణి వీరిని ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి రైతు ఈ మహిళా రైతులు సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ఇక్కడ కుల, మతాలు, వర్గ విభేదాలు, తక్కువ ..ఎక్కువలు ఉండవంటున్నారు ఇక్కడి మహిళలు. ఎన్ఐఆర్‌డి నిర్వాహకులు మహిళలకు శిక్షణ ఇచ్చారు. మందులు లేకుండా, పర్యావరణానికి ముప్పు వాటిళ్లకుండా వ్యవసాయం సాగు ఎలా చేయవచ్చో నేర్పించారు. ఐదేళ్ల నుంచి ఈ రకమైన వ్యవసాయం సాగవుతోంది. వీరు పడిన కష్టానికి ఇవాళ అవార్డు రూపంలో దక్కింది. వీళ్లు పొలాలకు ప్రాణం పోయడమే కాదు కాలుష్యపు కోరల్లో తమను తాము రక్షించుకునేలా చేశారు. ఎంతైనా మహిళలు కదూ.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి