ప్రేమా కవ్వించనీ..మనసా రవళించనీ
తెర మీద పాత్రలు మార్చినంత ఈజీగా ప్రేమికులు మారిపోతున్నారు. ప్రేమంటే రెండు గుండెల చప్పుడు. రెండు మనసుల మౌనం. ఒకరి కళ్లళ్లలోకి ఇంకొకరు చూసుకుంటూ ..లోకానికి ఆవల హృదయాలతో మాట్లాడుకోవడం. ప్రేమంటే ఏమిటంటే ..ప్రేమించాక తెలిసే అంటూ సినీ కవి రాసినా..ప్రేమ ఒక మధురమైన భావన. అనితర సాధ్యమైన ఆలోచన. అదొక్కటే మనలోకి చేరిపోతే..జీవితం కొత్తగా అనిపిస్తుంది. గుండెల్లో ఏదో కెలుతున్నట్లు..గాల్లో తేలిపోతున్నట్లు..మనసంతా దూది పింజెల్లా మారిపోతున్నట్లు..పక్షుల్లా గాల్లో ఎగురుతున్నట్లు అనిపిస్తుంటంది. ఇది సహజాతి సహజం కూడా. సామాన్యుల నుండి కోట్లున్న సంపన్నుల దాకా అందరూ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ప్రేమలో పడ్డ వారే..పడిపోయిన వారే. ప్రేమకున్న శక్తి అలాంటిది. ప్రేమ అన్నది ఓ దీపం లాంటిది. దానికి ఎప్పటికప్పుడు ఆత్మీయత అనే నూనె పోస్తూనే ఉండాలి. అది వెలుగుతూనే ఉంటుంది.
లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరికి కొన్ని ఫాంటసీస్ వుంటాయి. అవన్నీ జరగాలని లేదు. కొన్నిసార్లు ఈ ఆలోచనలు ఇలాగే వుండిపోతే బావుండునని అనిపిస్తుంటుంది. ఏం చేస్తాం. ఇవాళ ప్రేమంటే వ్యాపారం అయి పోయింది. ప్రతి దానిని కమర్షియల్‌గానే చూస్తున్నారు. దీంతో ఇన్‌స్టంట్ ఫుడ్ లాగా ..ఇనస్టంట్ లవ్ అన్నది ప్రస్తుతం రాజ్యమేలుతోంది. నిజంగా ప్రేమ అన్నది ఇవాళ లోకంలో ఉండబట్టే మనం ఇంత ఆనందంగా..స్వేచ్ఛగా..సంతోషంగా..బతకగలుగుతున్నాం. ప్రేమకు కుల , మతాలు , ప్రాంతీయ..భేదాలు..వర్గాలు..ఈర్ష్యలు..విద్వేషాలు..అసూయలు..మోసాలు ఏవీ వుండవు.. ఉన్నదల్లా అర్పించు కోవడం..ఒకరు లేకుండా ఇంకొకరు ఉండలేక పోవడం. ప్రేమంటే త్యాగం. ప్రేమంటే..చిరునవ్వుల వరమిస్తావా..చితి నుండి బతికొస్తాననడం..ప్రేమ బతికేందుకు బలాన్ని ఇస్తుంది..ఓటమి అంచుల నుంచి కాపాడుతుంది.
గెలుపొందేందుకు కావాల్సిన దారులను ..పరుస్తుంది. ఒకే ఆత్మ..ఒకే చూపు..ఒకే బాట..ఒకే అడుగు..ఒకే దారి..ఒకే ప్రపంచం..ఒకే జీవితం. శరీరాలు వేరైనా ..ఆత్మలంతా ఒక్కటే.. ఇదీ ప్రేమంటే. తన ప్రేయసి కోసం ఏకంగా తాజ్ మహల్‌నే కట్టించాడు. తాను గుండె నిండా ప్రేమించిన ముస్లిం యువతి కోసం ఇంగ్లండ్‌లో కోట్లాది సంపదను వదిలేసి వచ్చాడు హైదరాబాద్‌కు పాట్రిక్. ఇదీ ప్రేమకు ఉన్న శక్తి అంటే. నీ మీద కూడా పూలు చల్లుతున్నారు..నా మీద కూడా పూలు చల్లుతున్నారు. తేడా ఏమిటంటే..నువ్వు పెళ్లి పల్లకీ మీద..నేను శవ పేటిక మీద..అంటాడు ఓ చోట ప్యాట్రిక్. ఇప్పటికీ కూడా ఆమె కోసం చౌమహల్లా ప్యాలెస్ అలాగే వుంది. చెక్కు చెదరకుండా..జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ..గులాబీలు పరుచుకుంటూనే ఉన్నాయి.
ప్రేమ ఎప్పుడు ఎవరిని ఎలా పలకరిస్తుందో తెలియదు. కానీ ప్రేమించకుండా ఉండలేం. అలాంటి కోవలోకి అందరూ వస్తారు. కొందరు దాని నుండి తప్పించు కోవాలని చూస్తారు. కానీ అందులోనే పడి పోతారు. కాలాన్ని చూస్తూ గడిపేస్తారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు రొమాన్స్ పండించడంలో ఎవరికి వారే సాటి. రేఖ..అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్, సల్మాన్ ఖాన్‌ల జోడి ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో.. ఇటీవల కమలహాసన్, గౌతమిలు వీడిపోయారు. ఆయన కూతురు శృతి హాసన్ ..మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు. కొంతకాలంగా లండన్‌కు చెందిన థియేటర్ ఆర్టిస్ట్ మైఖెల్ కోర్సేల్‌తో ప్రేమలో పడ్డారు. పెళ్లి వరకు వచ్చారు. ఉన్నట్టుండి ఏమైందో ఈ అమ్మడికి..ప్రేమకు గుడ్ బై చెప్పేశారు. ఇలాంటి కహానీలు లెక్కలేదు సినీ రంగంలో. ఏది ఏమైనా ప్రేమ అన్నది ఇపుడు హాట్ టాపిక్. కాదనగలమా ఎవ్వరమైనా..ఎందుకంటే అదీ ప్రేమ కనుక. చివరగా ఒక్క మాట..ఎంతో చూడముచ్చటగా ఉన్న ఈ జంట వీడిపోవడం..అభిమానులకు బాధ కలిగించింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి