పిల్లల పాలిట దేవుడు ఈ కలెక్టర్
మనసుంటే మార్గాలు ఎన్నో. కావాల్సిందల్లా సంకల్పం. మనుషుల పట్ల కాసింత అభిమానం. చాలా మంది కలెక్టర్లు అధికార దర్పాన్ని ప్రదర్శిస్తారు. ఇంకొందరైతే దైవాంశ సంభూతులుగా భావిస్తారు. కానీ కష్టపడి పైకి వచ్చి..జాతీయ స్థాయిలో సివిల్ సర్వీసెస్ కు ఎంపికైన వారిలో ఎలాంటి డాబూ..దర్పం ఉండదు. సింపుల్ గా వుంటారు..ప్రజలను ప్రేమిస్తారు. వారి కోసం ఏమైనా చేయాలని తపనతో ఉంటారు. అలాంటి వారిలో కోవే ఒకరు. ఈ కలెక్టర్ ఏకంగా జనంతో కలిసి కొన్నేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న రోడ్డుకు మోక్షం కల్పించారు. ప్రపంచం ఈ కలెక్టర్ చేసిన ప్రయత్నాన్ని ప్రశంసలతో ముంచెత్తింది. కొందరు అధికారులు జనంతో, అధికారులతో మాట్లాడేందుకు సైతం ఇష్టపడరు.
కానీ వరంగల్ జిల్లా అర్భన్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ భిన్నంగా ఆలోచించారు. కొత్త ఐడియాకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రం మొత్తం ఆశ్చర్య పోయేలా ..మిగతా జిల్లాల కలెక్టర్లు నివ్వెర పోయేలా చేశారు. కార్పొరేట్ కాలేజీలు, స్కూల్స్ పిల్లలతో కలెక్టర్లు ఫోటోలు దిగుతున్నారు. ఎక్కడలేని ప్రచారం చేసుకుంటున్నారు. ఒక రకంగా సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన ఆయా జిల్లాల పరిపాలనాధికారులు ఇలా తమను తాము తక్కువ చేసుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలు ఇప్పటికే గాడి తప్పాయి. టీచర్లు ప్లాట్ల వ్యాపారంలో మునిగి పోయారు. చిట్టీల వ్యాపారం చేసుకుంటూ విద్యార్థులను గాలికి వదిలి వేశారు. కేసీఆర్ దెబ్బకు ఇపుడు బడి బాట పడుతున్నారు. పాటిల్ మాత్రం డిఫరెంట్ గా ఆలోచించారు. కొత్తదనానికి తెర తీశారు.
ఎంతో మంది పిల్లలకు, కలెక్టర్లకు స్ఫూర్తిగా నిలిచారు. ఈ కలెక్టర్ చేసిన మంచి పని ఏమిటంటే..సర్కారు బడుల్లో చదివి పదో తరగతిలో 10 కి 10 శాతం జిపిఏ సాధించిన విద్యార్థులందరిని తన వద్దకు పిలిపించుకున్నారు. అందరితో కలిసి కుల, మతాలకు అతీతంగా ..ప్రతిభ కనబర్చిన పిల్లలను ప్రత్యేకంగా అభినందించారు. వందలాది మంది పిల్లలతో కలిసి వెన్నుతట్టారు. ఎళ్లవేళలా ప్రోత్సాహం ఉంటుందని భరోసా ఇచ్చారు పాటిల్. కేవలం ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులందరు ఈ కలెక్టర్‌కు రుణపడి ఉంటామని..ఇంతటి గౌరవం తమకు దక్కడం ఆనందంగా ఉందంటూ ఉబ్బితబ్బిబ్బయ్యారు. డిఇఓను ఆదేశించిన కలెక్టర్ అర్బన్ వరంగల్ జిల్లా పరిధిలోని గవర్నమెంట్ స్కూల్స్‌లో జీపీఏ సాధించిన విద్యార్థులంతా కలెక్టర్ క్యాంపులో కొలువయ్యారు. కలెక్టర్ తో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
21 మంది పిల్లలు 10 జిపిఏ సాధించారు. వారితో కలిసి భోజనం చేయాలని అనుకుంటున్నానని, తక్షణమే ఏర్పాట్లు చేయమని డిఇఓ నారాయణరెడ్డిని ఆదేశించారు. పాటిల్ ఏకంగా మూడు గంటల పాటు వారితో గడిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులకు దిశా నిర్దేశనం చేశారు. కష్టపడి చదివితే ర్యాంకులు వాటంతట అవే వస్తాయంటూ తెలిపారు. ఉన్నత చదువులు చదివి పైకి రావాలని పిలుపునిచ్చారు. పిల్లల్లో ఆత్మ విశ్వాసం నింపేందుకు స్ఫూర్తి దాయకమైన కథలు వారికి చెప్పారు . కష్టపడి చదివి మార్కులు తెచ్చుకున్నందుకు ప్రత్యేకంగా విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఫలితాలు సాధించేందుకు కృషి చేసిన టీచర్లను కూడా ఘనంగా సన్మానించారు.
ప్రశాంత్ జీవన్ పాటిల్ చేసిన ఈ మంచి కార్యక్రమం ఇపుడు రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. ఎక్కడ చూసినా ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కలెక్టర్ చేసిన ఈ ప్రయత్నం చూసి మిగతా జిల్లాలలో కలెక్టర్లు ఇలాగే చేపట్టాలంటూ పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఆదేశించారు. అధికారం వుంటే సరిపోదు దానిని ఏ సమయంలో ఎలా వాడుకోవాలో తెలుసు కోవాలి. కలెక్టర్ అంటే అధికారాన్ని పొందడం, ప్రదర్శించడం కాదు జనానికి సేవ చేయడం. అందరూ పాటిల్ లాగా ఆలోచిస్తే ఎందరో పిల్లలు మరింత ఆనందానికి లోనవుతారు. జీవితంలో పైకి రావాలంటే కావాల్సిన స్ఫూర్తిని పొందుతారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి