పెన్ష‌న్ డ‌బ్బుల‌తో వంతెన నిర్మించిన యోధుడు

 ఎవ‌రైనా మ‌లి వ‌య‌సులో జీవితం హాయిగా వుండాల‌ని అనుకుంటారు. వ‌చ్చిన డ‌బ్బుల‌ను భ‌ద్రంగా దాచుకుంటారు. బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్ల‌లో మ‌దుపు చేస్తారు. ఇంకొంద‌రు ఎక్కువ వ‌డ్డీ వ‌స్తుంద‌నే ఆశ‌తో బంధువుల‌కో లేదా తెలిసిన వారికి ఇస్తారు. అవ‌స‌ర‌మైన‌ప్పుడు డ‌బ్బులు ప‌నికొస్తాయ‌ని ఆలోచ‌న అంతే. ఇంకొంద‌రు ప‌ద‌వీ విర‌మ‌ణ పొందాక ఇళ్ల‌లో విశ్రాంతి తీసుకుంటారు. కానీ ఒడిస్సా రాష్ట్రం కియోంజిహార్ జిల్లా కాన్పూర్ గ్రామానికి చెందిన గంగాధ‌ర్ రౌత్ మాత్రం అంద‌రిలా ఆలోచించ‌లేదు. ప‌శు సంవ‌ర్ద‌క శాఖ‌లో లైవ్ స్టాక్ ఇన్స్ పెక్ట‌ర్‌గా ప‌నిచేసి రిటైర్డ్ అయ్యారు. వ‌చ్చిన పెన్ష‌న్ డ‌బ్బుల‌తో త‌న క‌ర్త‌వ్యం ఏమిటో ఆలోచించాడు. 

ఏకంగా ఊరికి ఇబ్బందిగా మారిన వంతెన నిర్మాణం గురించి ప‌దుగురితో చ‌ర్చించాడు. వారి నుంచి స్పంద‌న రాలేదు. తానే అడుగులు వేశాడు. ఇందు కోసం స్వంతంగా త‌న డ‌బ్బుల‌ను వినియోగించాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. రౌత్..ఈ ప‌నిని సామాజిక బాధ్య‌త‌గా గుర్తించాడు. ఇందు కోసం తానే ముందుకు క‌దిలాడు. ఊరు దాటాలన్నా..రావాల‌న్నా ..సాలంది న‌దిని దాటాల్సిందే. వ‌ర‌ద‌లు వ‌చ్చినా, వాన‌లు భారీగా కురిసినా ఊరుకు క‌ష్టం వ‌చ్చేది. ఆస్ప‌త్రికి వెళ్లాల‌న్నా న‌ది దాటాల్సిందే. 

ఎప్పుడు వ‌ర‌ద వ‌చ్చి ముంచెత్తుతుందో తెలియ‌ని ప‌రిస్థితి. త‌మ‌కు వంతెన నిర్మించాల‌ని కోరుతూ గ్రామ‌స్తులు ఎన్నో సార్లు విన‌తులు స‌మ‌ర్పించారు.అయినా ప్ర‌భుత్వం కానీ సంబంధించిన అధికారులు కానీ స్పందించ‌లేదు. దీంతో విష‌య తీవ్ర‌త‌ను గ‌మ‌నించిన గంగాధ‌ర్ రౌత్ మాత్రం ఎంత ఖ‌ర్చ‌యినా స‌రే వంతెన పూర్తి కావాల‌ని త‌పించాడు. తానే ఆ నిర్మాణానికి శ్రీ‌కారం చుట్టారు.270 ఫూట్ ..లాంగ్ బ్రిడ్జిని ..కాన్పూర్ నుంచి దానేపూర్ గ్రామం వ‌ర‌కు యుద్ధ ప్రాతిప‌దిక‌న నిర్మించారు. 1200 మంది కాన్పూర్ గ్రామంలో నివ‌సిస్తున్నారు. వీరంతా ఇబ్బందుల‌కు లోన‌వుతున్న వారే. 20 ఏళ్ల‌యినా వంతెన నిర్మాణం అలాగే నిలిచి పోయింది. స్థానిక లీడ‌ర్ల‌కు విన్న‌వించారు. హ‌తాధి బ్లాక్ అడ్మినిస్ట్రేష‌న్ అధికారుల‌కు త‌మ గోడు వెళ్ల బోసుకున్నారు. 

చివ‌ర‌కు క‌రుణించి ..6 ల‌క్ష‌ల రూపాయ‌లు మంజూరు చేశారు బ్రిడ్జి నిర్మాణం కోసం. ఈ డ‌బ్బుల‌తో వంతెన పూర్తి కాదు..గంగాధ‌ర్ రౌత్ ముందుకు వ‌చ్చి ..తాను దాచుకున్న పెన్ష‌న్ డ‌బ్బుల ద్వారా వ‌చ్చిన మొత్తం డ‌బ్బులు 12 ల‌క్ష‌ల‌ను బ్రిడ్జి నిర్మాణం కోసం అంద‌జేశారు. త‌న‌లోని మాన‌వ‌త్వం బతికే ఉంద‌ని చాటారు. రౌత్ చేసిన ఈ సాయం దేశ వ్యాప్తంగా వైర‌ల్ అయింది. ఆ జిల్లా క‌లెక్ట‌ర్ రౌత్‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు. నిజంగా ఇలాంటి వారు కూడా ఈ దేశంలో ఉన్నారా అని అనిపిస్తోంది క‌దూ. కొన్ని ద‌శాబ్ధాలుగా ప‌రిష్కారానికి నోచుకోని వంతెన నిర్మాణం గంగాధ‌ర్ కృషి వ‌ల్ల విముక్తి ల‌భించింది ఆ ఊరి ప్ర‌జ‌ల‌కు.

కామెంట్‌లు