ఈ ఘోరం అవమానకరం


దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పశువైద్యాధికారిణి హత్య కేసు సంఘటనపై ప్రముఖులు, సినీవర్గాలు, రాజకీయ నేతలు పెద్ద ఎత్తున స్పందించారు. ఇంకా తమ ఆవేదనను, సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, ఇందు కోసం ప్రస్తుతం ఉన్న చట్టాలను సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల దాకా అన్ని వర్గాల వాళ్ళు ఈ దారుణ కాండను ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వాటిని యుద్ధ ప్రాతిపదికన మార్చాలని కోరుతున్నారు. ఎవ్వరైనా, ఏ స్థాయిలో ఉన్న వారైనా సరే నేరం చేసే ముందు అంతులేని భయానికి లోను కావాలని, అలాంటి చట్టాలు కావాలన్నారు.

ఇదిలా ఉండగా వెటర్నరీ డాక్టర్ ఘటన దేశ వ్యాప్తంగా అందరినీ కలిచి వేస్తోంది. ఇప్పటికే వేలాది మంది రోడ్లపైకి వచ్చారు. ఆమె కుటుంబానికి న్యాయం జరగాలంటూ నిరసనలు వెల్లు వెత్తుతున్నాయి. పలువురు బాలీవుడ్, టాలీవుడ్ సినీ ప్రముఖులు  స్పందించారు. అఘాయిత్యానికి పాల్పడిన వారిని శిక్షించాలంటూ తమ అభిప్రాయం చెప్పారు. లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేశ్ బాబు వెటర్నరీ డాక్టర్ ఘటనపై ట్విట్టర్లో స్పందించాడు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా పరిస్థితి మారడం లేదు. సమాజంలో మనం విఫలమవుతున్నాం. కేంద్ర, రాష్ట్రాలకు నా వ్యక్తిగత విజ్ఞప్తి ఏమిటంటే. ఇలాంటి నేరాలకు కఠినమైన చట్టాలు కావాలి. ఇలాంటి నేరాలకు మరణ శిక్ష విధించాలి.

బాధితురాలి కుటుంబ వేదన తీరనిది. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియ చేస్తున్నా. మహిళలందరికీ అండగా ఉంటూ కలిసి పోరాడదాం రండి. భారతదేశాన్ని సురక్షితంగా మార్చుకుందాం అంటూ ట్వీట్ చేశారు. మరో వైపు మహేశ్ వాయిస్ తో ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కవిత్వానికి మహేశ్ వాయిస్ ఓవర్  వినిపించాడు. అందులో మహేశ్ చెప్పిన పదాలు ప్రతి ఒక్కరిని ఆలోచింప చేస్తున్నాయి. ఒక మహిళ పట్ల మగాడు ఎలా ఉండాలో, ఏం చేయాలో చెప్పాడు. మొత్తంగా బాధితురాలి పట్ల ఆవేదన వ్యక్తమవుతోంది. 

కామెంట్‌లు