సత్తా చాటిన మన ఐఐటియన్స్


ఐఐటీ హైదరాబాద్‌లో మొదటి విడత క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో విద్యార్థులు సత్తా చాటారు. కేవలం ఒక్క స్లాట్‌ లోనే ఏకంగా 53 మంది విద్యార్థులకు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ లభించాయి. 2019–20 విద్యా సంవత్సరానికి గానూ ఐఐటీ హైదరాబాద్‌లో జరిగిన తొలి విడత ఎంపిక కార్యక్రంలో మొదటి స్లాట్‌ క్యాంపస్‌ ప్లేస్‌ మెంట్స్‌ ప్రారంభమయ్యాయి. మూడు గంటల పాటు కొనసాగింది. ఆ తర్వాత చేపట్టిన మరో రెండు స్లాట్లలో ప్లేస్‌మెంట్స్‌ సెలెక్షన్‌ రాత్రి 12 గంటల వరకు కొనసాగాయి. తొలి స్లాట్‌లో మొత్తం 15 కంపెనీలు పాల్గొనగా అందులో టీఎస్‌ఎంసీ, ఎస్‌ఎంఎస్, డేటాటెక్‌ అండ్‌ ఎన్‌టీటీ ఏటీ సంస్థ లు ఆరుగురు విద్యార్థులకు విదేశాల్లో ప్లేస్‌మెంట్స్‌ ఇచ్చాయి.

బుక్‌మైషో, స్ప్రింక్లర్, జాగ్వార్, బజాజ్‌ ఆటో, బెన్‌వై మెల్లన్, డామినో డాటా ల్యాబ్స్, కాగోపోర్ట్‌ వంటి కంపెనీలు ప్లేస్‌మెంట్స్‌లో తొలి సారి పాల్గొనడం విశేషం. మైక్రోసాఫ్ట్, గోల్డ్‌మ్యాన్‌ సాక్స్, సేల్స్‌ఫోర్స్, ఇంటెల్, క్వాల్‌కామ్, ఒరాకిల్‌ వంటి సంస్థలు ఐఐటీహెచ్‌కు వచ్చాయి. అందులో అత్యధికంగా మైక్రోసాఫ్ట్‌ 17 మందికి ఆఫర్లను ఇచ్చిందని, వారిలో ఐదుగురు అమ్మాయిలు ఉన్నట్లు ఐఐటీ ప్లేస్‌మెంట్స్‌ ఇన్‌చార్జి అధికారి ప్రదీప్‌ తెలిపారు. ఇక గోల్డ్‌ మ్యాన్‌ సాక్స్‌ ముగ్గురు విద్యార్థులకు ఆఫర్‌ ఇవ్వగా అందులో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. గత ఏడాది తొలిరోజు 3 స్లాట్లలో చేపట్టిన ప్లేస్‌మెంట్స్‌లో 56 మందికే ఉద్యోగాలు లభించగా, ఈసారి తొలిరోజు ఫస్ట్‌ స్లాట్‌లోనే 53 మందికి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ రావడం గమనార్హం.

తొలి విడత క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ ఈనెల 12 వరకు కొనసాగ నుండగా, రెండో విడత క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ వచ్చే జనవరి నుంచి ఏప్రిల్‌ మధ్య నిర్వహించనుంది. ఈ ఏడాది మొదటి విడత క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ కోసం 477 మంది రిజిస్టర్‌ చేసుకోగా, 224 కంపెనీలు విద్యార్థులకు అవకాశం ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. అదే గతేడాది మొదటి విడతలో విద్యార్థులకు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ కల్పించేందుకు మొత్తంగా 150 కంపెనీలే వచ్చాయి. మొత్తం మీద మన కుర్రాళ్లకు భలే డిమాండ్ ఉందన్నమాట. ఎంతైనా ఐఐటీ అంటేనే వేరు కదూ. అయితే ఈ మొత్తం ప్లేస్ మెంట్స్ లలో ఎక్కువ ప్యాకేజి ఎవరికి వచ్చింది, ఏ కంపెనీ ఆఫర్ చేసిందన్న విషయం మాత్రం ఐఐటి వెల్లడించ లేదు.

కామెంట్‌లు