ప్లీజ్..మమ్మల్ని వదిలేయండి


దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన పశువైద్యురాలు ప్రియాంక రెడ్డి హత్య కేసు రోజు రోజుకు కొత్త మలుపు తిరుగుతోంది. ఆమె పట్ల మృగాళ్లు అనుసరించిన అమానవీయ దారుణంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. కఠిన శిక్షల కంటే ఆ నిందితులను వెంటనే ఉరి తీయాలంటూ జాతి యావత్తు ముక్త కంఠంతో కోరుతోంది. అడుగడుగునా బాధితురాలి పట్ల పోలీసుల నిర్లక్ష్యమే అగుపించింది. దీంతో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అధినేతలు, ప్రముఖులు, సినీ వర్గాలు పెద్ద ఎత్తున విచారం వ్యక్తం చేశారు. మరో వైపు తాకిడి ఎక్కువ కావడంతో తమకు ప్రైవసీ అంటూ లేకుండా పోతోందంటూ ప్రియాంకా రెడ్డి పేరెంట్స్ వాపోతున్నారు.

దయచేసి మేం అల్లారు ముద్దుగా పెంచుకున్న మా బిడ్డ మాకు లేకుండా పోయింది. సాయం చేయమంటూ కోరినా పట్టించుకోని, స్పందించని పోలీసులు ఇప్పుడు మా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ఇక చాలు, మాకు ఎవ్వరి సానుచూతి వద్దు. నేరస్థులకు కఠిన శిక్ష పడేలా చేయమని మాత్రమే మేము కోరుతున్నాము అని వేడుకున్నారు. ఇదిలా ఉండగా ఈ దుస్సంఘటనను తలచుకుని ప్రియాంకా రెడ్డి తల్లిదండ్రులు కుమిలి పోతున్నారు. పరామర్శల పేరుతో పలువురు నేతల పర్యటనతో వారు మరింత మానసిక వేదనకు గురవుతున్నారు. చని పోయిన తమ కుమార్తెను ఎవరూ తిరిగి తీసుకు రాలేరని, దయచేసి తమను పరామర్శించేందుకు ఎవరూ రావొద్దని ప్రియాంకా రెడ్డి తల్లిదండ్రులు రాజకీయ నేతలు, పోలీసులు, మీడియా ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.

పలువురు నేతలు, ప్రముఖులు ప్రియాంక కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న విషయం తెలిసిందే. తమ ఇంట్లోకి ఎవరూ రాకుండా లోపల నుంచి గేటుకు తాళం వేసుకున్నారు. తమ బిడ్డకు జరిగిన అన్యాయానికి సరైన న్యాయం జరిగితే చాలని, సానుభూతి అవసరం లేదని స్పష్టం చేశారు. తమ వేదనను అర్థం చేసుకోవాలని కోరారు. సరైన సమయంలో పోలీసులు స్పందించి ఉంటే తమ ప్రియాంక దక్కేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపదలో ఆదుకోవాల్సిన పోలీసులు ఇప్పుడు తమ ఇంటి చుట్టూ తిరగడం ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి స‍్పందించాల్సి ఉందని డిమాండ్‌ చేశారు.

బిడ్డ చనిపోయాక మమ్మల్ని ఓదార్చడానికి రాజకీయ నాయకులు రావడం ఎందుకంటూ మండిపడ్డారు. సానుభూతి, పరామర్శల పేరుతో తాము విసిగి పోయామని, ఎవరు వచ్చినా తమకు చేసేదేమీ లేదని అన్నారు. అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితులను శిక్షించాలని ఆందోళన చేసిన వారిపై లాఠీఛార్జ్‌ ఎలా చేస్తారంటూ ప్రశ్నలు సంధించారు. మొత్తం మీద వారి ఆవేదనను అర్థం చేసు కోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. 

కామెంట్‌లు