మదుపరులకు మహదావకాశం

మదుపరులకు గుడ్ న్యూస్. కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం ప్రకటించింది. ఇక ఈక్విటీల మాదిరే కార్పొరేట్‌ బాండ్‌ మార్కెట్లోనూ రిటైల్‌ ఇన్వెస్టర్లు చురుగ్గా ఇన్వెస్ట్‌ చేసే అవకాశం రానుంది. ఇందుకు వీలుగా దేశంలోనే తొలి కార్పొరేట్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ ప్రారంభానికి ప్రధాని మోదీ సారథ్యంలోని కేంద్ర కేబినెట్‌ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఈ ఈటీఎఫ్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అదనపు నిధుల సమీకరణ సులభం కానుంది. బడ్జెట్లో పేర్కొన్నట్టుగా బాండ్‌ మార్కెట్‌ను ఇది మరింత విస్తృతం చేస్తుందని కేబినెట్‌ భేటీ అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. భద్రత, లిక్విడిటీ, పన్ను లేని స్థిరమైన రాబడులను బాండ్‌ ఈటీఎఫ్‌ అందిస్తుంది అని వివరించారు. రిటైల్‌ ఇన్వెస్టర్లు సైతం 1,000 నుంచి బాండ్లలో ఇన్వెస్ట్‌ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.

బాండ్లకు డిమాండ్‌ పెరిగితే, అప్పుడు తక్కువ ఖర్చుకే నిధులను సమీకరించుకునే అవకాశం ప్రభుత్వ రంగ సంస్థల కుంటుందని మంత్రి చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థల రుణ అవసరాలకు అనుగుణంగా ఏటా బాండ్‌ కేలండర్‌ను రూపొందిస్తామన్నారు. కాగా, ఈ నెల్లోనే భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ను ప్రారంభించే అవకాశాలున్నాయని పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం పేర్కొంది. భారత్‌– 22 ఈటీఎఫ్‌ మాదిరే ‘భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌’నూ స్టాక్‌ ఎక్సేంజీల్లో లిస్ట్‌ చేస్తారు. అవసరమైతే విక్రయించి సొమ్ము చేసుకోవచ్చు. ఒక్కో యూనిట్‌ విలువ1,000. ఈ లెక్కన ఇన్వెస్టర్లు ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. క్లోజ్‌ ఎండెడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లా మూడేళ్లు, పదేళ్ల స్థిర కాల వ్యవధితో భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ను జారీ చేస్తారు. వాటి కాలవ్యవధి వరసగా 2023లో, 2030లో ముగుస్తుంది.

గ్రోత్‌ ఆప్షన్‌ మాత్రమే ఉంటుంది. డివిడెండ్‌ ఆప్షన్‌ ఉండదు. రాబడులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కంటే మెరుగ్గా, స్థిరంగా ఉంటాయి. 10 ఏళ్ల ప్రభుత్వ బాండ్ల ఈల్డ్స్‌తో పోలిస్తే 0.50–1.40 శాతం అధికంగా ఉండొచ్చని అంచనా. బాండ్‌ ఈటీఎఫ్‌లో పెట్టుబడులపై వచ్చిన మూలధన లాభాల్లోంచి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయిస్తారు. ఆ తరవాతే పన్ను చెల్లించాల్సి ఉంటుంది కనక పన్ను చాలా వరకూ తగ్గుతుంది. ప్రతి ఆరు నెలలకోసారి ఈటీఎఫ్‌ న్యూ ఫండ్‌ ఆఫర్‌ ఉంటుంది. ఇందు కోసం ఎన్‌ఎస్‌ఈ ఒక ఇండెక్స్‌ను రూపొందిస్తుంది. ఈటీఎఫ్‌ అన్నది పలు బాండ్ల సమూహం. ఏదైనా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ తన నిధుల కోసం భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ కింద బాండ్లను జారీ చేయవచ్చు.

ఈ భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ నిర్వహణ బాధ్యతలను ఎడెల్‌వీజ్‌ ఏఎంసీ చూస్తుంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్, డీహెచ్‌ఎఫ్‌ఎల్, ఎస్సెల్‌ గ్రూపులు రుణ పత్రాలపై తీసుకున్న బకాయిల్ని చెల్లించటంలో విఫల మవ్వడాన్ని ఇటీవల చూశాం. వీటిల్లో రిటైల్‌ ఇన్వెస్టర్లు నేరుగా ఇన్వెస్ట్‌ చేసినా, లేక మ్యూచువల్‌ ఫండ్స్‌ రూపంలో ఇన్వెస్ట్‌ చేసినా డిఫాల్ట్‌ రిస్క్‌ ఎదుర్కోవాల్సి వచ్చేది. ప్రభుత్వం తెస్తున్న భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌లో ఇలాంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఈ ఈటీఎఫ్‌ కింద బాండ్ల రూపంలో నిధులు సమీకరించేవన్నీ ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలే. ప్రభుత్వ సంస్థలు రుణ చెల్లింపుల్లో విఫలం కావడం ఇప్పటి వరకు అరుదే. ఎందుకంటే వీటి వెనుక ప్రభుత్వం ఉంటుంది. మొత్తంగా చూస్తే డబ్బులు ఎక్కడ దాచుకోవాలో అని నానా హైరానా పడుతున్న వారికి ఇదో గొప్ప అవకాశం కదూ.

కామెంట్‌లు