జగన్ రెడ్డి నిర్ణయం..విశిష్ట సేవలకు పురస్కారం
తన తాత రాజా రెడ్డి లోని పట్టుదల, తండ్రి రాజా శేఖర్ రెడ్డి లోని తెగువను పుణికి పుచ్చుకున్న ప్రస్తుత ఏపీ సియంగా ఉన్న సందింటి జగన్ మోహన్ రెడ్డి అసాధారణమైన రీతిలో జనరంజకమైన పాలనను కొనసాగిస్తూ ఇతరులకు స్ఫూర్తి దాయకంగా నిలుస్తున్నారు. తనను నమ్ముకున్న వారికి సముచితమైన రీతిలో గుర్తింపు ఇస్తున్నారు. కష్ట కాలంలో తన వెంట ఉన్న నటులు పృథ్వీ రాజ్, ఆలీ, మండలి బుద్ధ ప్రసాద్, రోజా, లక్ష్మి పార్వతి, విజయ సాయి రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, తదితరులకు పదవులను కట్టబెట్టారు. ఇదే సమయంలో జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఏటా వివిధ రంగాలలో విశిష్టమైన రీతిలో సేవలు అందించిన 100 మందికి లైఫ్ టైం అవార్డులతో సత్కరించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన, ప్రజలకు విశిష్ట సేవలు అందించిన వారిని గుర్తించి ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ అవార్డులను ఇవ్వాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ పురస్కారం కింద 10 లక్షల నగదు బహుమతితోపాటు ముఖ్యమంత్రి చేతుల మీదుగా జ్ఞాపికను ఇచ్చి సత్కరిస్తారు. సామాజిక, సేవా రంగాలు, సామాజిక ప్రాజెక్టులకు అందించిన సేవలు. ప్రజా వ్యవహారాలు, న్యాయ, రాజకీయ, ప్రజా సేవలు, స్పేస్ ఇంజినీరింగ్, న్యూక్లియర్ సైన్స్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక అంశాల్లో పరిశోధన, అభివృద్ధి, బ్యాకింగ్, ఆర్థిక వ్యవహారాలు, టూరిజం, వాణిజ్య నిర్వహణ, విస్తరణలో ఇవ్వనున్నారు.
ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో విశిష్ట సేవలు అందించిన ఎడిటర్స్, జర్నలిస్టులు, వైద్య రంగంలో ఆయుర్వేద, హోమియో, సిద్ధ, అల్లోపతి, ప్రకృతి వైద్యం (నేచురోపతి) రంగాల్లో పరిశోధకులకు, కళలు, సాహిత్యం, విద్య రంగాలలో జర్నలిజంతో సహా కళలు, సాహిత్యం, విద్యా రంగాల్లో పాఠ్య పుస్తకాల రూపకల్పన, బోధన, విద్యా విస్తరణ, సంస్కరణ తదితర రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి ఇవ్వనున్నారు. ఇక ప్రజా సేవా పరంగా పరిపాలన రంగంలో ప్రజలకు అత్యుత్తమ, అసాధారణ సేవలు అందించిన ప్రభుత్వ ఉద్యోగులకు, క్రీడారంగంలో ప్రసిద్ధ కీడ్రలు, అథ్లెటిక్స్, పర్వతా రోహకులు, యోగా, క్రీడల విస్తరణకు పాటుపడ్డ వారికి ఇస్తారు.
వీటితో పాటు సంస్కృతి, మానవ హక్కులు, వన్య ప్రాణుల పరిరక్షణ తదితర రంగాల్లో సేవలు అందించిన వారిని కూడా ఈ అవార్డులకు ఎంపిక చేస్తారు. పురస్కారాల కోసం వచ్చిన దరఖాస్తులను సెలక్షన్ కమిటీ పరిశీస్తుంది. ఈ కమిటీని ఏటా ముఖ్యమంత్రి నియమిస్తారు. అవార్డుల బహూకరణకు రెండు నెలల ముందు ఈ కమిటీ సిఫార్సులు స్వీకరిస్తుంది. వచ్చిన నామినేషన్లను పరిశీలించి ఎవరెవరికి అవార్డులు ఇవ్వాలో జాబితా తయారు చేసి సీఎం కు సిఫార్సు చేస్తుంది. జగన్ మోహన్ రెడ్డిదే తుది నిర్ణయం. ప్రతియేటా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా , జనవరి 26న ఈ పురస్కారాలను సీఎం చేతుల మీదుగా బహూకరిస్తారు. ఏడాదికి వంద అవార్డులు మించ కుండా ఇస్తారు. కాగా వీటిని వచ్చే ఏడాది నుంచి ఇవ్వనున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి