మహీంద్రాకు భారీ లాభం


ఐటీ సెక్టార్ లో టాప్ పొజిషన్ లో ఉన్న టెక్ మహీంద్రా కంపెనీకి భారీ లాభం సమకూరింది. ఈ ఆర్థిక ఏడాది సెప్టెంబర్ క్వార్టర్లో 1,124 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో వచ్చిన నికర లాభం  1,064 కోట్లతో పోలిస్తే 6 శాతం వృద్ధి సాధించినట్లు టెక్‌ మహీంద్రా ఎండి, సీఈఓ సీపీ గుర్నాని తెలిపారు. కార్య కలాపాల ఆదాయం 8,630 కోట్ల నుంచి 5 శాతం వృద్ధితో 9,070 కోట్లకు పెరిగిందని వెల్లడించారు. ఇక డాలర్ల పరంగా చూస్తే, నికర లాభం 14 శాతం వృద్ధితో 16 కోట్ల డాలర్లకు, ఆదాయం 3 శాతం వృద్ధితో 128 కోట్ల డాలర్లకు పెరిగాయి.

స్థిర కరెన్సీ పరంగా చూస్తే, ఆదాయం 4 శాతం పెరిగింది. డిజిటల్‌ విభాగం ఆదాయం సీక్వెన్షియల్‌గా 12 శాతం ఎగసింది. నిర్వహణ లాభం 7 శాతం తగ్గి 501 కోట్లకు చేరింది. ఏటీఅండ్‌టీ కంపెనీతో బహుళ సంవత్సరాల ఒప్పందాన్ని ఈ క్యూ2లో కుదుర్చుకుంది. ఇందులో భాగంగా కంపెనీ కొత్తగా  5,749 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,31,522 కు పెరిగింది.

అమెరికాకు చెందిన బార్న్‌ గ్రూప్‌ కంపెనీని 671 కోట్లకు టెక్‌ మహీంద్రా అనుబంధ సంస్థ, పీటీఈ లిమిటెడ్‌ కొనుగోలు చేయనున్నది. న్యూయార్క్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీకి లండన్, సింగపూర్, హాంకాంగ్, ఇండియాలో కార్యాలయాలు ఉన్నాయి.  

కామెంట్‌లు