తొలగని ప్రతిష్టంభన..తప్పని నిరీక్షణ

తమ డిమాండ్ల సాధన కోసం అలుపెరుగని రీతిలో పోరాటం చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు మరోసారి సీఎం ఛాన్స్ ఇచ్చారు. ఇప్పటికైనా సంఘాల మాటలు పక్కన పెట్టి, వెంటనే విధుల్లో చేరాలని సూచించారు. కేసీఆర్ డెడ్ లైన్ ను ససేమిరా అన్నారు కార్మికులు. సమస్యలు పరిష్కరించే దాకా ఆందోళన విరమించమని బాధితులు తేల్చి చెప్పారు. ఇక చర్చలు కాదు కదా, అసలు ఆర్టీసీనే ఉండదని ప్రభుత్వం అంటోంది. డిమాండ్లలో వేటిని అంగీకరిస్తారో, వేటిని తిరస్కరిస్తారో తర్వాత, ముందు చర్చలకు పిలవండి అని కార్మిక సంఘాలు అంటున్నాయి. అసలు సమ్మె ఎప్పుడు ముగుస్తుందోనని తెలంగాణ జనం ఎదురు చూస్తోంది.

ప్రభుత్వం ముందే ప్రకటించినట్టు ప్రైవేటు బస్సులతో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే 5,100 రూట్లలో ప్రైవేట్‌ బస్సులకు పర్మిట్లు ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. మిగతా రూట్లను ఆర్టీసీకి వదిలేయాలని అప్పట్లో నిర్ణయించారు. కానీ ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు కేవలం 1,700 మంది మాత్రమే మిగిలారు. బస్సులు నడవాలంటే 23 వేల మంది ఉద్యోగులు అవసరమవుతారు. గత్యంతరం లేక మిగతా రూట్లను కూడా ప్రైవేటు బస్సులతోనే నడిపించాలని నిర్ణయించినట్టు సమాచారం. కోర్టు తీర్పు ఇచ్చే దానిపైనే ప్రభుత్వం ఓ ఫైనల్ డిసిషన్ కు వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఆర్టీసీలో 30 శాతం కేంద్రానికి వాటా ఉంది.

ఆర్టీసీ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం జోక్యం చేసుకునేలా చేయాలని కార్మిక సంఘాల జేఏసీ గట్టిగా యత్నిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆర్టీసీ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును కేంద్రం నిశితంగా గమనిస్తోందంటూ చాలా సార్లు వ్యాఖ్యానించారు. అన్ని ఉద్యోగ సంఘాల మద్దతు కూడగట్టేందుకు జేఏసీ ట్రై చేస్తోంది. ఆర్టీసీ కార్మికుల సహకార పరపతి సంఘానికి 200 కోట్లు, 452.86 కోట్ల ఎంవీ ట్యాక్స్‌ చెల్లించాలని ట్రాన్స్‌పోర్టు అథారిటీని హైకోర్టు హుకుం జారీ చేయటం ఆర్టీసీకి ఇబ్బందిగా పరిణమించింది. మరో వైపు ఆర్టీసీ జేఏసీ మాత్రం కోర్టు తమ వైపు ఉందని, అంతిమ విజయం తమదేనని భరోసాను వ్యక్తం చేస్తోంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!