సేనకు పవార్ పంచ్

మరాఠాలో సీఎం కుర్చీ పీటముడి ఇంకా వీడలేదు. ఏదైనా ఇస్తామంటున్న బీజేపీ ఆ ఒక్కటి అడుగొద్దంటోంది. దీంతో ఎలాగైనా సరే పవర్ లోకి రావాలని శివసేన పావులు కదుపుతోంది. ఎన్సీపీ, కాంగ్రెస్‌ మద్దతుతో నైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సీఎం పీఠాన్ని అధిష్టించాలని భావిస్తున్న శివ సేనకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఎన్సీపీ మద్దతు కోసం శివ సేన సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌ నెరిపిన దౌత్యం ఫలించలేదు. ప్రభుత్వంలో చేరేది లేదని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ తెగేసి చెప్పారు. ప్రజా తీర్పునకు అనుగుణంగా తాను, తన మిత్రపక్షం కాంగ్రెస్‌ పార్టీతో కలిసి ప్రతిపక్షంలో కూర్చుంటామని స్పష్టం చేశారు.

ప్రభుత్వ ఏర్పాటులో ఎలాంటి పాత్ర పోషించాలను కోవడం లేదు. ప్రతిపక్షంలో కూర్చోవాలని ప్రజలు తీర్పు ఇచ్చారు.  కొన్ని రోజుల పాటు నేను ముంబైలో ఉండటం లేదు. పుణె, సతారా, కరాద్‌ ప్రాంతాల్లో పర్యటించబోతున్నాను అని శరద్‌ తెలిపారు. శివసేన సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌తో భేటీ అనంతరం మాట్లాడారు. మర్యాద పూర్వకంగా శరద్‌తో భేటీ అయినట్టు రౌత్‌ చెప్తున్నప్పటికీ.. బీజేపీ రహిత ప్రభుత్వ ఏర్పాటులో ఎన్సీపీ, కాంగ్రెస్‌ మద్దతు కోరేందుకు ఆయన పవార్‌తో భేటీ అయినట్టు తెలుస్తోంది.

ఇక అధికారాన్ని పంచు కోవడంలో బీజేపీ, శివసేన మధ్య రేగిన సంక్షోభం ఏ మలుపు తిరుగుతుందో ఎవరి అంచనాలకు అందడం లేదు. శివ సైనికులు మహారాష్ట్ర గవర్నర్‌ను కలిస్తే, ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాని కలిసి భవిష్యత్‌ ప్రణాళికపై చర్చించారు. ఈ అధికార పోరాటంలో అవసరమైతే శివసేనకు మద్దతునివ్వాలని భావించిన ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఢిల్లీలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీతో చర్చలు జరిపారు. దీంతో ఇప్పుడు బీజేపీ, శివసేన తమ తదుపరి వ్యూహాలకు పదును పెడుతున్నాయి.  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!