మరాఠాలో న్యూ ట్విస్ట్..గడ్కరీకి ఛాన్స్..?
డెడ్ లైన్ విధించినా మరాఠాలో రాజకీయాలలో ఎలాంటి మార్పులు కనిపించడం లేదు. రోజు కో ట్విస్ట్ ఇస్తూ బీజేపీ, శివ సేన పార్టీలు జనాన్ని మరింత ఉత్కంఠకు లోను చేస్తున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగుస్తోంది. అయినా ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత రాలేదు. సీఎం ఫడ్నవీస్ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌తో భేటీ కావటం, బీజేపీ, శివ సేన తెర వెనుక చర్చలు, బీజేపీ నేతలు గవర్నర్ భగత్‌సింగ్‌ను కలవడంతో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. వీరిలో ప్రస్తుత సీఎం ఫడ్నవిస్ లేక పోవడం విస్తు పోయేలా చేసింది. గవర్నరును కలవటంపై తమకు ఆహ్వానం లేదని శివసేన స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తెర వెనక పరిణామాలు చాలానే జరుగుతున్నాయి.
ప్రతిష్టంభన తొలగాలంటే గడ్కరీని సీఎంను చేయడమే పరిష్కారమని ఆరెస్సెస్ చీఫ్ భావిస్తున్నారనేది రాజకీయ వర్గాల సమాచారం. దీనికి శివసేన తేలిగ్గా అంగీకరిస్తుందన్న అంచనాలున్నాయి. ఎందుకంటే ఆది నుంచీ శివసేనతో గడ్కరీకి మంచి సంబంధాలే ఉన్నాయి. దివంగత అధ్యక్షుడు బాల్ థాకరేకు గడ్కరీ అత్యంత సన్నిహితుడు. థాకరే జీవించి ఉన్న రోజుల్లో గడ్కరీ ఆయన నివాసం మాతోశ్రీకి తరచూ వెళ్లేవారు. బీజేపీ, శివ సేన ల మధ్య ఎప్పుడు విభేదాలు చోటు చేసుకున్నా గడ్కరీయే మధ్య వర్తిత్వం నెరిపి పరిష్కరించే వారు. గడ్కరీని సీఎంను చేస్తే శివసేన ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములాపై పట్టు వీడ వచ్చని బీజేపీ అంచనా వేస్తోంది. కాకపోతే ఇప్పటికే ఫడ్నవీస్‌ను తమ శాసనసభా పక్ష నేతగా మహారాష్ట్ర బీజేపీ ఎన్నుకుంది. సీఎంగా ఆయనే ఉంటారని బీజేపీ స్పష్టంగా చెప్పింది కూడా.
తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ నితిన్ గడ్కరీతో భేటీ కావటం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రజా తీర్పును గౌరవించి మహారాష్ట్రలో వెంటనే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ, శివసేనలకు శరద్ పవార్ స్పష్టం చేశారు. ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి బాధ్యతాయుత ప్రతిపక్ష పాత్రను పోషిస్తుందని చెప్పారాయన. బీజేపీ, శివసేన బంధం 25 ఏళ్లుగా ఉందని, ఆ రెండు పార్టీలే రేపో మాపో ఒక అవగాహనకు వస్తాయని చెప్పారాయన. 170 మంది ఎమ్మెల్యేల మద్దతుతో శివసేన సీఎం పదవిని చేపట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై పవార్ ఆశ్యర్యం వ్యక్తం చేశారు. వారెవరో చూడాలని ఉందన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి