కుదరని స్నేహం..ముదిరిన సంక్షోభం
మరాఠా పీటముడి వీడడం లేదు. ఇండియన్ పాలిటిక్స్ లో ట్రబుల్ షూటర్ గా ఉన్న అమిత్ చంద్ర షా రంగంలోకి దిగినా మహారాష్ట్ర లో రాజకీయ ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ, శివసేన పార్టీల మధ్య సయోధ్య కుదర లేదు. దీంతో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో సీఎం కుర్చీని వీడేది లేదని ఇరు పార్టీల చీఫ్స్ ఉద్దవ్ థాక్రే, ఫడ్నవీస్ స్పష్టం చేశారు. దీంతో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఎలాంటి అడుగులు మాత్రం పడటం లేదు. సీఎం పీఠం సహా అధికార పంపిణీ సమంగా జరగాలన్న తమ డిమాండ్ నుంచి శివసేన వెనక్కు తగ్గడం లేదు.
అదే విషయాన్ని శివసేన నేత సంజయ్ రౌత్ మరోసారి తేల్చి చెప్పారు. అధికారాన్ని సమంగా పంచు కోవడంపై బీజేపీ లిఖిత పూర్వక హామీ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. శివసేన నేతనే మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి అవుతాడని పునరుద్ఘాటించారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన శుభవార్త ఏ క్షణమైనా రావొచ్చు అని రాష్ట్ర మంత్రి సుధీర్ ముంగంటి వార్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఫడ్నవిస్ నివాసంలో జరిగిన పార్టీ సీనియర్ నేతల భేటీ అనంతరం ఆయన ఆ వ్యాఖ్య చేశారు. శివసేన నుంచి సానుకూలమైన ప్రతిపాదన కోసం ఎదురు చూస్తున్నామన్నారు.
మరో వైపు బీజేపీతో, ఎన్డీయేతో శివసేన సంబంధాలు తెంచుకుంటేనే, రాజకీయ ప్రత్యామ్నాయంపై ఆలోచిస్తామని శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ప్రకటించింది. ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభనకు పరిష్కారం లభించని నేపథ్యంలో సీఎం ఫడ్నవిస్ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌తో భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు మోహన్ భగవత్‌తో భేటీ అయ్యారు. ఇరువురు ఏం చర్చించారనే విషయంపై ఆరెస్సెస్ వర్గాలు మాత్రం నోరు విప్పడం లేదు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి