బ్రాండ్లు భళా..కలర్స్ కళ కళ
ఇండియాలో నిర్మాణ రంగం శరవేగంగా వృద్ధి చెందుతోంది. ఐటీ పరంగా టాప్ పొజిషన్ లో ఉన్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరంగా దూసుకు పోతోంది. కలర్స్ కంపెనీస్ లాభాల బాట పట్టాయి. ఇల్లయినా, కార్యాలయమైనా అద్దంలా మెరవాలని అంతా అనుకుంటారు. అందుకే కొత్త కొత్త రంగులతో భవనానికి రంగులు వేసేందుకు ప్రయారిటీ ఇస్తున్నారు. ఓనర్స్ తమ ఇంటి కైనా, ఆఫీసు కైనా గతంలో ఆరేళ్లకు ఒకసారి పెయింట్స్ వేసే వారు. ఇప్పుడు ఆ ధోరణి మారింది. రెండేళ్లకు ఒకసారి వేస్తున్నారు. బెడ్ రూమ్స్, లివింగ్ రూమ్స్ విషయంలో తరచూ రంగులు మారుస్తున్న కస్టమర్లు పెరుగుతున్నారని కంపెనీలు చెబుతున్నాయి.
కస్టమర్ల ‘కలర్‌ఫుల్’ ఆలోచనలతో పెయింట్ కంపెనీలు కళకళ లాడుతున్నాయి. ఏటా రెండంకెల వృద్ధి సాధిస్తూ పల్లెల్లో సైతం విస్తరిస్తున్నాయి. స్టాక్ మార్కెట్లో మిడ్, స్మాల్‌క్యాప్ షేర్లు అంత బాగా లేకున్నా, లిస్టెడ్ పెయింట్ కంపెనీల షేర్ల ధరలు ఈ ఏడాదిలో 65 శాతం దాకా పెరిగాయి. ప్రధాన బ్రాండ్లు గ్రామీణ ప్రాంతాలకూ చొచ్చుకు పోయాయి. మొత్తం పరిశ్రమలో వినియోగం పరంగా పట్టణాల వాటా 60 శాతం కాగా, మిగిలినది గ్రామీణ ప్రాంతాలది. ఈ మధ్య గ్రామాల్లోనూ ప్రీమియం రంగులు వాడుతుండటం విశేషం. వినియోగం పెరుగుతుండటంతో ప్రధాన కంపెనీలన్నీ ఎప్పటికప్పుడు తమ సామర్థ్యాన్ని విస్తరిస్తున్నాయి.
ఏటా విస్తరణ, మార్కెటింగ్ కోసమే 300 కోట్ల నుంచి 500 కోట్లు దాకా ఖర్చు పెడుతున్నాయి. ఈ రంగంలో ఇప్పటి వరకు 10,000 కోట్ల దాకా పెట్టుబడులు పెట్టాయి. దేశీ పెయింట్స్ పరిశ్రమ రెండు దశాబ్దాలుగా రెండంకెల వృద్ధి నమోదు చేస్తోంది. రసాయనాలు లేని, లేదా అతి తక్కువ వీఓసీ ఉన్న పెయింట్లు వస్తున్నాయి. బ్యాక్టీరియాను దరి చేరనీయని, ఎక్కువ కాలం మన్నే రంగులను ప్రధాన కంపెనీలు ప్రోత్సహిస్తున్నాయి. దేశంలో పెయింట్స్ విపణి విలువ దాదాపు 50,000 కోట్లకు చేరుకుంది. జాతీయ స్థాయి లో 10 వరకు బ్రాండ్లు పోటీ పడుతుండగా... ప్రాంతీయ కంపెనీలు 100 వరకూ ఉన్నాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి