దాడులు ఆపం..ఉగ్ర మూకలను వదలం
పెద్దన్న అమెరికా తన పట్టు విడుపు ధోరణిని మార్చు కోవడం లేదు. ఎప్పటి లాగానే ప్రపంచంలో ఎక్కడ ఉగ్ర మూకలు దాక్కున్నా వారిని వెతికి పట్టుకుని, కాల్చి పారేస్తామని హెచ్చరికలు జారీ చేసింది అగ్ర రాజ్యం. తాజాగా ఎవ్వరిని వదలబోమని స్పష్టం చేసింది. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు, ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబు బాకర్ అల్ బాగ్దాదీని హత మార్చి, ఉగ్రవాదులకు గట్టి హెచ్చరికలు జారీ చేశామని అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి మార్క్ ఎస్పర్ వెల్లడించారు. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం పక్కా పథకం ప్రకారం వాయువ్య సిరియాలో అమెరికా సైన్యం బాగ్దాదీని మట్టు బెట్టినట్లు పేర్కొన్నారు.
మార్క్ మాట్లాడుతూ.. పాశవిక దాడులు, హత్యలకు.. నరమేధానికి కారణమైన బాగ్దాదీని హతం చేసే క్రమంలో ఒక్క అమెరికా సైనికుడు కూడా ప్రాణాలు కోల్పోలేదని తెలిపారు. బాగ్దాదీ అంతం తర్వాత కూడా సిరియాలో ఉద్రిక్త పరిస్థితులే ఉన్నాయని..కొన్ని బాహ్య శక్తులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని వెల్లడించారు. సిరియాలో ఐసిస్‌ను ఓడించేందుకు 2014 నుంచి ప్రయత్నించాం. ఇందులో భాగంగా ఐసిస్ చర్యలకు అడ్డుకట్ట వేయడంతో అధ్యక్షుడు ట్రంప్ సూచనలతో కొన్ని రోజుల క్రితం అమెరికా సేనలు వెనక్కి వచ్చాయి. అయితే ఏరివేయగా అక్కడ మిగి లిపోయిన కొంత మంది ఉగ్రవాదులు మరోసారి విధ్వంసానికి ప్రయత్నించారు.
ఈ క్రమంలో సిరియన్ డెమొక్రటిక్ బలగాలు మాకు సహకరించాయి. దీంతో వాయువ్య సిరియాలో మేము పట్టుబిగించాం అని చెప్పారు. ఈ రహస్య ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు మా దగ్గర ఉన్నాయి. అయితే ఇప్పటికిప్పుడు వాటిని విడుదల చేయ లేము. భవిష్యత్తులో అవి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అమెరికా సైన్యం లక్ష్యం ఎక్కడున్నా..ఎంత దుర్భేద్య మైనది అయినా దానిని ఛేదించడంలో ఏమాత్రం తడబడదు. టార్గెట్‌ను కొట్టి తీరుతుంది. మా దగ్గర ఎంతో గొప్ప దైన సైన్యం ఉంది. ఎవరిపైనైనా.. ఎక్కడి నుంచైనా.. ఏ సమయంలోనైనా మేము దాడి చేయగలం. కాబట్టి ఉగ్రవాదులంతా అప్రమత్తంగా ఉండండి అని హెచ్చరించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి